Arjuna Ranatunga: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. నానాటికీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి బంగాళఖాతం లోతు కన్నా అడుగంటుతున్నది. మరోవైపు ప్రజలు ఆందోళనలు, నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.
మన పొరుగుదేశం శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆ దేశాన్ని కోలుకోనీయకుండా చేస్తున్నది. కొవిడ్ సంక్షోభానికి తోడు దేశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రజల పాలిట శాపమయ్యాయి. ద్రవ్యోల్బనం కారణంగా లంకలో ప్రజలు ఏది ముట్టుకున్నా వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితులను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా.. మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో అని రోడ్ల మీదకు వచ్చిన ప్రజల నిరసనలపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో దేశమంతా నిరసనకారులకు మద్దతు తెలుపుతున్నది. అయితే ఒకవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే కొంతమంది క్రికెటర్లు మాత్రం డబ్బులకు ఆశపడి ఐపీఎల్ లో ఆడుతుండటాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు అర్జున రణతుంగ తీవ్రంగా విమర్శించారు.
ఐపీఎల్ లో ఆడుతున్న లంక క్రికెటర్లు వారం రోజుల్లోగా తమ దేశానికి వచ్చేయాలని రణతుంగ కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ కాంట్రాక్టులు పోతాయనే భయంతో క్రికెటర్లు స్పందించకపోవడంపై రణతుంగ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యతిరేకంగా మాట్లాడితే కాంట్రాక్టులు పోతాయని భయమా..?
రణతుంగ మాట్లాడుతూ... ‘అసలేం జరగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి నిరసనలకు పాల్పడుతుంటే.. పలువురు క్రికెటర్లు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ సమస్యతో తమకేం సంబంధం లేదన్నట్టుగా ఐపీఎల్ లో ఆడుతున్నారు. వాళ్లంతా ఈ ప్రభుత్వానికి భయపడుతున్నారు. ఈ క్రికెటర్లంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్రీడా మంత్రిత్వ శాఖ కింద పనిచేసే బోర్డులో సభ్యులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ కాంట్రాక్టులు పోతాయని వాళ్లు భయపడుతున్నారు.
కానీ ఇప్పటికే సమయం మించిపోయింది. ఇకనైనా మాట్లాడండి. ఎందరో యువ క్రికెటర్లు సైతం వాళ్ల కెరీర్లను ఫణంగా పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మీరు (క్రికెటర్లు) తప్పకుండా స్పందించాలి. అది మీ సామాజిక బాధ్యత. ఇక ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్ల గురించి చెప్పాల్సి వస్తే.. నేనెవరి పేరును చెప్పను గానీ మీరు వారం రోజుల్లో మీ జాబ్ (కాంట్రాక్ట్) నుంచి వైదొలిగి ప్రజల నిరసనలకు మద్దతునివ్వండి..’ అని అన్నారు.
నేనెందుకు పాల్గొనడం లేదంటే..
ఈ నిరసనల్లో తానెందుకు పాల్గొనడం లేదని అడిగిన ప్రశ్నకు రణతుంగ సమాధానమిస్తూ... ‘నేను 19 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇక ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ సమస్య కాదు. ఇప్పటివరకు ఈ నిరసనలలో ఏ రాజకీయ పార్టీ గానీ, రాజకీయనాయకులు గానీ జోక్యం చేసుకోలేదు. ప్రజలే ఈ పోరాటాన్ని నడిపిస్తున్నారు. అదే ఈ దేశానికి బలం...’ అని చెప్పారు.
ఐపీఎల్ లో లంక ప్లేయర్లు :
- వనిందు హసరంగ : ఆర్సీబీ
- భానుక రాజపక్స : పీబీకేఎస్
- దుష్మంత చమీర : లక్నో సూపర్ జెయింట్స్
- చమీక కరుణరత్నే : కోల్కతా నైట్ రైడర్స్
ఐపీఎల్ లో లంక కోచ్ లు :
- ముత్తయ్య మురళీధరన్ : సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటార్ అండ్ బౌలింగ్ కోచ్
- మహేళ జయవర్ధనే : ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్
- కుమార సంగక్కర : రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్
- లసిత్ మలింగ : రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్
