నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన ఆస్ట్రేలియా... ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా నుంచి హోరాహోరీ ఫైట్ ఆశిస్తున్నట్టు తెలిపిన టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియాని ఇన్నింగ్స్ తేడాతో ఓడించిన భారత జట్టు, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి పైచేయి సాధించింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ పోరు చూడొచ్చని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది...
టెస్టుల్లో టాప్ టీమ్‌గా ఉన్న ఆస్ట్రేలియా, నాగ్‌పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే చాప చుట్టేసింది. భారత జట్టు 400 పరుగుల భారీ స్కోరు చేసిన పిచ్‌పై, ఆసీస్ ఒక్క ఇన్నింగ్స్‌లోనూ 200 మార్కును అందుకోలేకపోయింది..
‘ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కి నేను ఓ మంచి సలహా ఇవ్వాలని అనుకుంటున్నా. ఇంగ్లాండ్‌లా ఆడాలనుకుంటే యాషెస్‌లో ఆడండి. ఇండియాలో టెస్టు సిరీస్ గెలవాలనుకుంటే మాత్రం మునుపటి ఆస్ట్రేలియాలా ఆడండి...
వన్‌సైడ్ మ్యాచులు చూస్తుంటే మీకు మాత్రమే కాదు, మాకు కూడా బోర్ కొడుతుంది. ఆస్ట్రేలియా పోరాడాలి, టీమిండియాకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగాలి. నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో ఇంటెంట్ కనిపించలేదు...
వచ్చిన బ్యాటర్ వచ్చినట్టు పెవిలియన్ చేరడానికే ఎక్కవ ప్రాధాన్యం ఇచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆడేందుకు భయపడుతున్నట్టు క్లియర్‌గా కనిపించింది. ఆస్ట్రేలియా ఇప్పటికైనా తేరుకోకపోతే భారత జట్టు 4-0 తేడాతో సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేయడం ఖాయం...
ఐపీఎల్ ఆడే ప్లేయర్లకు భారత పిచ్‌ల గురించి అవగాహన ఉంటుందని ఆస్ట్రేలియా భావిస్తోంది. అయితే వాళ్లను ప్రస్తుతానికి పక్కనబెట్టేయండి. భారీ హిట్టింగ్‌కి దిగే ప్లేయర్లను బరిలో దింపండి. ఇండియాని ఇండియాలో ఓడించగలమని కాన్పిడెన్స్‌తో బరిలో దిగితే సరిపోతుంది...
ఆస్ట్రేలియాకి మంచి బౌలింగ్ అటాక్ ఉంది. వాళ్ల ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లకు మంచి రికార్డు ఉంది. భారత జట్టుకి ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఇదే కరువైంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..
చూస్తుంటే తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫెయిలైన డేవిడ్ వార్నర్ గురించే రవిశాస్త్రి ఈ కామెంట్లు చేసినట్టు అర్థమవుతోంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ఆడిన డేవిడ్ వార్నర్, రెండో టెస్టులోనూ 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ ఆడిన మరో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్, నాగ్‌పూర్ టెస్టులో పర్వాలేదనిపించాడు...
తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కి కూడా ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అయితే ప్యాట్ కమ్మిన్స్, కొన్ని కారణాల వల్ల ఐపీఎల్ 2023 టోర్నీకి దూరంగా ఉన్నాడు.
రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో ఆస్ట్రేలియాలో పర్యటించి, రెండుసార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచింది టీమిండియా. గత పర్యటనలో ఆడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చి 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది భారత జట్టు..
