విరాట్ కోహ్లీ... ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ ఆటగాడు. టీమిండియా రన్ మెషిన్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఇతడి బ్యాట్ నుండి ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ లు జాలువారాయి. సచిన్ తర్వాత అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన రికార్డు అతడి సొంతం. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు   ఐసిసి ర్యాకింగ్స్ పరంగా చూస్తేమాత్రం అతడు మామూలు ఆటగాడిలానే కనిపిస్తున్నాడు. టీ20 ర్యాకింగ్స్ లో అయితే అతడు పసికూన అప్ఘాన్ ఆటగాళ్లకంటే వెనుకబడిపోయాడు. కేవలం వన్డేల్లో తప్పిస్తే మిగతా ఫార్మాట్లో అతడు టాప్ లో నిలవలేకపోయాడు.  

తాజాగా ఐసిసి ప్రకటించిన టీ20 ర్యాకింగ్స్ లో అయితే కోహ్లీ టాప్ టెన్ లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఫార్మాట్ లో పాకిస్థాన్  ఆటగాడు బాబర్ ఆజమ్ 896 రేటింగ్ పాయింట్స్ తో టాప్ ను నిలబెట్టుకోగా అప్ఘాన్ ప్లేయర్ హజ్రతుల్లా సైతం 715 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. కానీ టీమిండియా టాప్ ప్లేయర్స్ రోహిత్ 9, లోకేశ్ రాహుల్ 10, విరాట్ కోహ్లీ 11, శిఖర్ ధవన్ 13వ స్థానాలకు పరిమితమయ్యారు. టీ20 జట్ల ర్యాకింగ్స్ లోనూ పాక్ టాప్ లో భారత్ 4వ స్థానంలో నిలిచింది. 

వన్డే ర్యాకింగ్స్ లో మాత్రం కోహ్లీ 863, రోహిత్ శర్మ 827, బాబర్ ఆజమ్ 820 రేటింగ్ పాయింట్లతో టాప్ 3 స్థానాల్లో నిలిచారు. అలాగే టెస్టుల్లో ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 937, కోహ్లీ 903 రేటింగ్ పాయింట్లతో టాప్ 1, 2 స్థానాల్లో నిలిచారు. ఈ రెండు పార్మాట్లలో భారత్ ర్యాకింగ్ మేరుగ్గానే వుంది. 

2020లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ టీ20 ర్యాకింగ్స్ భారత అభిమానుల్లో కలవరాన్ని రేకెత్తిస్తున్నారు. మన జట్టు, ఆటగాళ్లు ఇంత అద్వాన్నమైన ర్యాకింగ్స్ లో కొనసాగుతున్నారంటే ఈ టీ20 క్రికెట్లో మనం బాగా వెనుకబడినట్లే. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఈ విభాగంలో చాలా  మెరుగ్గా కనిపిస్తోంది. కాబట్టి భారత్ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే టీ20 ప్రపంచ కప్ గెలవడం కష్టమేనని అభిమానులు ఈ ర్యాకింగ్స్ ను బట్టి అంచనాకు వస్తున్నారు. 

ఇక ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సీరిస్ గెలవలేకపోవడం కూడా అభిమానుల అనుమానాలకు తావిస్తోంది. అత్యుత్తమ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తున్న జట్టు టీ20 ఫార్మాట్ లో మాత్రం నిలకడగా విజయాలు సాధించలేకపోతోంది. మరో ఏడాదిలోపు సమస్యలన్నింటిని అధిగమించి కోహ్లీసేన ప్రపంచ కప్ సాధించగలిగితే టీ20 ర్యాకింగ్స్ లో కూడా భారత్ హవా  కొనసాగనుంది.