Lata Mangeshkar Passes Away: గానకోకిల లతామంగేష్కర్ కూడా క్రికెట్ కు వీరాభిమాని. ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఆమె తన బిజీ షెడ్యూల్ లో కూడా స్కోరు వివరాలు తెలుసుకునేవారట...
భారతదేశంలో ప్రజలకు ఎంతో ఇష్టమైన వాటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచేవి ఒకటి సినిమా.. రెండు క్రికెట్. యాధృశ్చికంగా ఈ రెండింటికీ విడదీయరాని అనుబంధం ఉంది. మూకీల నుంచి మొదలు నేటి ఓటీటీ ప్రపంచం దాకా.. భారత్ లో వెండితెరను క్రికెటర్లను వేరుగా చూడలేం. ఇందుకు లతా మంగేష్కర్ కూడా అతీతులు కారు. ఆమెకు కూడా క్రికెట్ అంటే మక్కువ ఎక్కువే. భారత క్రికెట్ ఎత్తుపల్లాలను కూడా ఆమె చూశారు. దేశ క్రికెట్ దిగ్గజాలతో ఆమెకు సత్సంబంధాలున్నాయి. ఆమెకు చాలా ‘ఇష్టమైన స్నేహితుడు’ మాజీ క్రికెటరే..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు రాజ్ సింగ్ దుంగార్పూర్.. లతా మంగేష్కర్ కు క్లోజ్ ఫ్రెండ్. ఈ ఇద్దరూ ప్రేమించుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. పెండ్లి కూడా చేసుకుంటారని గుసగుసలు వినిపించాయి. కానీ పలు కారణాల వల్ల వీళ్ల ప్రేమ.. పెళ్లి దాకా రాలేదు. కాగా.. భారత ప్రభుత్వం మంగేష్కర్ కు భారతరత్న ప్రకటించిన విషయాన్ని తొలుత ఆమెకు వెల్లడించింది (ఆ సమయంలో ఆమె లండన్ లో ఉంది) దుంగార్పురే. 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యులతో ఆమెకు మంచి అనుబంధం ఉంది.
సచిన్ కు అమ్మ తో సమానం..
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు లతా జీ అంటే చాలా ఇష్టం. ఆమెను కలవడానికి అవకాశం వస్తే దానిని సచిన్ వదులుకునేవాడు కాదు. సచిన్.. లతాజీ ని ‘అమ్మ’ (ఆయి) అని పిలిచిన రోజును తానెప్పుడూ మరిచిపోనని ఆమె చెప్పేవారు. ‘సచిన్ నన్ను అమ్మలా భావిస్తాడు. అతడు నన్ను అమ్మ అని పిలిచిన రోజును నేనెప్పటికీ మరిచిపోలేను. సచిన్ అలా పిలుస్తాడని నేనస్సలు ఊహిచంలేదు. సచిన్ వంటి కొడుకు నాకు వరంగా దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని..’అని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.
సచిన్ తన ప్రతి పుట్టినరోజు సందర్భంగా లతాజీని కలిసి ఆశీస్సులు తీసుకుంటాడు. అయితే సచిన్ పుట్టినరోజు (ఏప్రిల్ 24) నే లతా మంగేష్కర్ తండ్రి వర్ధంతి. దీంతో సచిన్.. ఆ ముందు రోజు గానీ తర్వాత రోజు గానీ లతాజీ ని కలిసేవాడు. లతా మంగేష్కర్ పాటలంలే సచిన్ చెవికోసుకుంటాడు. తనకు ఒత్తిడిలో ఉన్నప్పుడల్లా ఆమె మెలోడీలను వింటూ హాయిగా నిద్రపోయేవాడినని సచిన్ గతంలో పలుమార్లు చెప్పాడు.
కోహ్లికి కూడా అభినందనలు..
2013 లో సచిన్ క్రికెట్ నుంచి నిష్క్రమించినా లతాజీ మాత్రం క్రికెట్ చూడటాన్ని వీడలేదు. ఈ తరం క్రికెటర్లు విరాట్ కోహ్లి, ధోని కోసం కూడా ఆమె తన పాటలను డెడికేట్ చేశారు. 2016లో కోహ్లి ఇంగ్లాండ్ తో టెస్టు మ్యాచులో డబుల్ సెంచరీ (235) చేశాడు. అప్పుడు ఆమె కోహ్లి కోసం ‘ఆకాశ్ కే ఉస్ పర్ భి’ పాటను అంకితమిచ్చారు.
2010లో వీవీఎస్ లక్ష్మణ్.. ఆస్ట్రేలియాపై మొహాలీ టెస్టులో అద్భుతంగా ఆడి భారత్ కు విజయాన్ని అందించగానే అతడిపై ప్రశంసలు కురిపించారు. 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా సెమీఫైనల్ లో భారత్-పాక్ హై ఓల్టేజీ మ్యాచ్ కు ముందు లతా మంగేష్కర్ టీమిండియాకు విషెస్ తెలిపారు. అనంతరం భారత జట్టు సెమీస్ లో భారత్ ను ఓడించడమేగాక ఫైనల్ లో శ్రీలంకను చిత్తు చేసి రెండో ప్రపంచకప్ నెగ్గింది.
విజయాల్లోనే కాదు.. మన జట్టు ఇబ్బందుల్లో కూడా లతా మంగేష్కర్ భారత జట్టుకు అండగా నిలిచారు. దిగ్గజ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణించినప్పుడు గానీ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడ్డ సమయంలో గానీ ఆమె జట్టుకు మద్దతు ప్రకటించింది. తాను నిజమైన క్రికెట్ ఫ్యాన్ అని నిరూపించుకుంది.
