అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కు భారీ షాక్ తగిలింది. శ్రీలంక పేసర్ లసిత్ మలింగ్ ఐపిఎల్ కు దూరమవుతున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతను టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ పాటిన్సన్ ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. 

ఐపిఎల్ నుంచి లసిత్ మలింగ తప్పుకోవడానికి కారణాలను వెల్లడించలేదు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ లో తాను జట్టుకు అందుబాటులో ఉండలేనని మలింగ చెప్పాడు. శ్రీలంకతో తన కుటుంబ సభ్యులతో ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అతని స్థానంలో జేమ్స్ పాటిన్సన్ ఈ వారాంతంవో జట్టుతో కలుస్తాడని ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ చెప్పారు. 

ముంబై ఇండియన్స్ విజయాల్లో పలుమార్లు లసిత్ మలింగ కీలకమైన భూమిక పోషించాడు. నిరుడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచులో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన ప్రతిభతో జట్టుకు ట్రోఫీని అందించాడు. 

సీజన్ కు దూరమైన మలింగకు తాము పూర్తిగా మద్దతు ఇస్తామని, పాటిన్సన్ రాకను స్వాగతిస్తున్నామని ఆకాశ్ చెప్పారు. జేమ్స్ తమకు సరిపోతాడని, యూఏఈలోని పరిస్తితులకు తగినట్లు తమ పేస్ దాడిలో భాగమవుతాడని అన్నారు. 

లసిత్ మలింగ ఓ దిగ్గజమని, ముంబైకి మూల స్తంభమని, అతడి సేవలను తాము కోల్పోతున్నామని చెప్పడంలో సందేహం లేదని, అయితే కుటుంబంతో కలిసి ఉండాలనే లసిత్ కోరికను తాము అర్థం చేసుకున్నామని ఆయన అన్నారు. 

ముంబై ఇండియన్స్ అంటే విలువలతో కూడిన ఒక కటుుంబమని, ఇంటి సభ్యులకు తాము కచ్చితంగా అండగా ఉంటామని ఆయన అన్నారు.