క్రికెట్‌లో ప్రశాంతతకు నిలువెత్తు రూపం ఎం.ఎస్‌ ధోని. ఎంతటి ఒత్తిడిలోనైనా మహి తన సహనం కోల్పోయిన దాఖలాలు చాలా అరుదు. 2017 శ్రీలంకతో వన్డేలో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై కెప్టెన్‌ కూల్‌ ఆగ్రహించిన ఘటనను ఈ చైనామన్ క్రికెటర్‌ గుర్తు చేసుకున్నాడు. 

కుల్దీప్‌ యాదవ్‌పై 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో మహి ఆగ్రహించిన సంగతి తెలిసిందే. అయితే, మహి గత 20 ఏండ్లలో తన సహనం కోల్పోవటం అదే ప్రథమమని కుల్దీప్‌ యాదవ్‌ స్వయంగా వెల్లడించడం విశేషం. 

అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌ చాట్‌లో కుల్దీప్‌ ఆ విషయం గురించి ఇలా చెప్పాడు. శ్రీలంకతో మ్యాచులో కుషాల్ పెరెరా అంతకు ముందు బంతిని బౌండరీకి తరలించడంతో ఫీల్డింగ్ సెట్ చేసుకో అని ధోని వికెట్ల వెనక నుంచి అరిచాడట. అది సరిగా వినిపించని కుల్దీప్ ఫీల్డింగులో మార్పులేమీ చేయకుండానే తరువాతి బాల్ వేయడం, అది కూడా బౌండరీని ముద్దాడడం త్వరత్వరగా జరిగిపోయాయి. 

ఇక ఆతరువాత పట్టరాని కోపంతో వికెట్ల వెనకనుంచి పట్టరానికోపంతో ధోని తన మీదకు దూసుకుఇచ్చి కోప్పడ్డాడని ఆనతి సంఘటనను కుల్దీప్ యాదవ్ గుర్తు చేసుకున్నాడు. 

'కుశాల్‌ పెరీరా కవర్స్‌ మీదుగా బౌండరీ కొట్టాడు. ఫీల్డింగ్‌ మార్పులు చేయమని వికెట్ల వెనుక నుంచి ధోని అరుస్తున్నాడు. నేను ఏమాత్రం పట్టించుకోలేదు. పెరీరా తర్వాతి బంతినీ రివర్స్‌ స్వీప్‌ షాట్‌తో బౌండరీ బాదాడు. ఆగ్రహించిన ధోని నా వద్దకు వచ్చి.. నేనేమైనా పిచ్చోడిని అనుకుంటున్నావా? 300 వన్డేలు ఆడాను. అసలు నా మాట వినటం లేదు నువ్వు? అని కోపగించుకున్నాడు. 

దాంతో నాకు ఎంతో భయమేసింది. మ్యాచ్‌ అనంతరం బస్‌ వరకూ ధోనితో కలిసి వెళ్లాను. గతంలో ఎప్పుడైనా ఇలా కొప్పడ్డారా అని అడిగాను. అందుకు మహి గత 20 ఏండ్లలో ఇలా జరగటం ఇదే తొలిసారి అన్నాడు' అని కుల్దీప్‌ యాదవ్‌ చెప్పుకొచ్చాడు.

ఈ కరోనా లాక్ డౌన్ వేళా క్రికెటర్లంతా ఇంట్లోనే ఉండమని తమ అభిమానులకు సూచిస్తూ వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే ఇలా తమ అభిమానులతో ముచ్చటించారు.