Asianet News TeluguAsianet News Telugu

తిప్పేసిన కుల్దీప్, మ్యాజిక్ చేసిన సిరాజ్... తొలి టెస్టులో పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్...

నాలుగు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్... మహ్మద్ సిరాజ్‌కి 3 వికెట్లు... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. 

Kuldeep Yadav picks four, Mohammed Siraj picks 3, Bangladesh lost 8 wickets in Day 2 of 1st Test
Author
First Published Dec 15, 2022, 4:24 PM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. చాలా రోజుల తర్వాత టెస్టు టీమ్‌లోకి వచ్చిన కుల్దీప్ యాదవ్‌ తన స్పిన్ మ్యాజిక్‌తో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కుల్దీప్‌ నాలుగు వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది బంగ్లాదేశ్... 

తొలి ఇన్నింగ్స్‌లో  టీమిండియా చేసిన 404 పరుగులకి ఇంకా 271 పరుగులు వెనకబడి ఉంది బంగ్లా  జట్టు. తొలి రెండు వన్డేల్లో టీమిండియాకి విజయాన్ని దూరం చేసిన మెహిదీ హసన్ మిరాజ్‌, టెస్టుల్లో కూడా ఇబ్బందిపెడుతున్నాడు... రెండో రోజు బంగ్లాని ఎంత తక్కువ స్కోరుకి పరిమితం చేయగలిగితే మ్యాచ్ ఫలితం అంత త్వరగా తేలిపోయే అవకాశం ఉంది.. 

బంగ్లా ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ షాంటోని అవుట్ చేసి, బంగ్లాకి ఊహించని షాక్ ఇచ్చాడు మహ్మద్ సిరాజ్. తొలి బంతికే కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు షాంటో...

ఆ తర్వాత 17 బంతుల్లో 4 పరుగులు చేసిన యాసిర్ ఆలీని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. 30 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసి భారత బౌలర్లపై కౌంటర్‌ అటాక్ చేసిన లిటన్ దాస్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

45 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన మరో ఓపెనర్, తొలి టెస్టు ఆడుతున్న జాకీర్ హుస్సేన్ 45 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి... సిరాజ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 25 బంతుల్లో 3 పరుగులు చేసిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 75 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్...

22 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన నురుల్ హసన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 58 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన ముస్తాఫిజుర్ రహీంని పెవిలియన్ చేర్చిన కుల్దీప్ యాదవ్, తైజుల్ ఇస్లామ్‌ని డకౌట్ చేశాడు...

10 ఓవర్లలో 3 మెయిడిన్లతో 4 వికెట్లు పడగొట్టాడు కుల్దీప్ యాదవ్. మహ్మద్ సిరాజ్‌కి 3 వికెట్లు దక్కగా ఉమేశ్ యాదవ్ ఓ వికెట్ తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 404 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 278/6 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా 126 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది. 

శ్రేయాస్ అయ్యర్ 192 బంతుల్లో 10 ఫోర్లతో 86 పరుగులు చేసి అవుట్ కాగా ఛతేశ్వర్ పూజారా 203 బంతుల్లో 11 ఫోర్లతో 90 పరుగులు చేసి టీమిండియా తరుపున తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ అవుటైన తర్వాత కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి 8వ వికెట్‌కి 92 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

113 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టుల్లో 13వ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 114 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్, టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు...

Follow Us:
Download App:
  • android
  • ios