ఐపిఎల్ సీజన్ 12 ను ఘనంగా ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆ జోరును చివరివరకు కొనసాగించలేకపోయింది. ఈ టోర్నీ మధ్యలోనే చతికిలపడిపోయింది. ఆ జట్టు వరుసగా చివరి ఐదు మ్యాచులను ఓడిపోయి ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశాలను కష్టతరం చేసుకుంది. ఇలా ఈ జట్టు లీగ్ దశలో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచులకు గాను కేవలం 4 మాత్రమే గెలిచి ఆరింట ఓటమిపాలయ్యింది. దీంతో తదుపరి నాలుగు మ్యాచులను తప్పనిసరిగా గెలిస్తే తప్ప ఆ జట్టు ప్లేఆఫ్ రేసులో వుండే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తమ జట్టు గెలుపుకోసం పకడ్బందీ వ్యూహాలతో తదుపరి మ్యాచుల్లో బరిలోకి దిగనున్నట్లు  కోచ్ జాక్వస్ కల్లిస్ వెల్లడించాడు. 

ముఖ్యంగా కోల్ కతా బ్యాటింగ్ ఆర్డర్లలో మార్పులుండే అవకాశముందని కలిస్ తెలిపాడు. తమ జట్టులో ప్రధాన ఆటగాడిగా మారి టాప్ స్కోరర్ గా నిలిచిన ఆల్ రౌండర్  రస్సెల్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చోటుచేసుకోవచ్చన్నారు. అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ కల్పించి ముందే బరిలోకి దింపే ఆలోచనలో వున్నట్లు...అయితే జట్టు అవసరాలకు అనుగుణంగా ఈ మార్పులను కెప్టెన్, యాజమాన్యం మాత్రమే చేపడుతుందని కలిస్ స్పష్టం చేశాడు. 

 కతకత్తా జట్టు ఆటగాళ్లలో ప్రస్తుతం రస్సెల్స్ మంచి  ఫామ్‌తో వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. దీంతో జట్టు విజయంలో అతడి పాత్ర కీలకంగా మారింది. ఇలా అత్యంత విలువైన ఆటగాడిగా మారిన రస్సెల్స్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 217.77 స్ట్రైక్ రేట్ తో 329 పరుగులు సాధించాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగి 65.33 సగటుతో ఈ పరుగులను సాధించాడు. 

అయితే చివరి ఐదు మ్యాచుల్లోనూ అతడు అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో కేకేఆర్ ఓటమిని చవిచూసింది. దీంతో ఆ జట్టుకు ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోవడం కఠినంగా మారింది. ఇలాంటి క్లిష్ట సమయంలో గురువారం రాజస్థాన్ తో జరిగే మ్యాచులో మార్పులు చేయడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని కేకేఆర్ భావిస్తోంది.