Asianet News TeluguAsianet News Telugu

Emirates T20 League: ఎడారిదేశంలో మినీ ఐపీఎల్.. రెండు జట్లను సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్, ముంబై..?

Shah Rukh Khan: ఇండియాలో పలు ఫ్రాంచైజీల మీద పెట్టుబడులు పెట్టిన యజమానులే త్వరలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో మొదలుకాబోయే ఎమిరేట్స్ ప్రీమియర్ లీగ్-2022 లో కూడా వాటాలు కొన్నట్టు తెలుస్తున్నది.

Kolkata Knight Riders Owner Shah Rukh khan, Mumbai Indians buy Teams in the Emirates T20 League
Author
Hyderabad, First Published Nov 19, 2021, 6:05 PM IST

ఇండియాలో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఖ్యాతి ఖండాంతరాలు దాటింది.  క్రికెట్ ఆడే దేశాలతో సంబంధం లేకుండా అన్ని దేశాల్లో ఈ లీగ్  కు ఫ్యాన్స్ ఉన్నారు. క్యాష్ రిచ్ లీగ్ గా గుర్తింపు పొందిన ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు కాసుల పంట పండుతున్నది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ కొత్త జట్ల వేలంలో రెండు కొత్త ఫ్రాంచైజీల  బిడ్స్  చూస్తూ ఇది నిజమనిపించక మానదు. ఐపీఎల్ లో కొత్త ఫ్రాంచైజీలుగా చేరిన లక్నో (రూ. 7,090 కోట్లు), అహ్మదాబాద్ (రూ. 5,625 కోట్లు) వేల కోట్లు కుమ్మరించాయి. అయితే భారత్ లో పలు ఫ్రాంచైజీల మీద పెట్టుబడులు పెట్టిన  యజమానులే త్వరలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో మొదలుకాబోయే ఎమిరేట్స్ ప్రీమియర్ లీగ్ (Emirates Premier League 2022) లో కూడా వాటాలు కొన్నట్టు తెలుస్తున్నది. 

వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో  ఈ లీగ్ జరుగనున్నది. ఈ మేరకు ఎమిరేట్స్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) లోగో, ఇతర వివరాలు కూడా ప్రకటించింది. ఆరు జట్లు ఇందులో పాల్గొననున్నాయి. అయితే ఈ ఆరు జట్లలో సగం.. అంటే మూడు జట్లను ఇండియాలోని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లే దక్కించుకున్నట్టు సమాచారం.  ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ అధినేత Shah Rukh Khanతో పాటు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యజమాని అంబానీ కూడా చెరో జట్టు దక్కించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమచారం. 

షారుఖ్, అంబానీ తో పాటు Delhi Capitals లో సగం  పెట్టుబడులున్న కిరణ్ కుమార్ గాంధీ కూడా ఈపీఎల్ లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తున్నది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఓ జట్టు కొనడానికి యత్నించినా  ఆ ప్రయత్నాలు ఫలించలేదని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చివరి నిమిషంలో  CSK వెనక్కితగ్గిందట.

పలు జాతీయ  మీడియాలలో వస్తున్న కథనాల మేరకు.. ఈపీఎల్ లోని ఆరు  ఫ్రాంచైజీలను కింది యాజమాన్యాలు దక్కించుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే.. 
- ముంబయి ఇండియన్స్..
- కోల్కతా నైట్ రైడర్స్..
- కిరణ్ కుమార్ గాంధీ (ఢిల్లీ క్యాపిటల్స్)
- కప్రి గ్లోబల్.. వీళ్లు ఇటీవలే ఐపీఎల్ లో కొత్త  ఫ్రాంచైజీ కోసం బిడ్ కూడా వేశారు. కానీ విఫలమయ్యారు. 
- గ్లేజర్ ఫ్యామిలీ.. మాంచెస్టర్ యూనైటెడ్ ఓనర్స్ (వీళ్లు కూడా ఐపీఎల్ జట్టు కోసం ప్రయత్నించి విఫలం చెందారు)
- సిడ్నీ సిక్సర్స్.. బిగ్ బాష్ లీగ్ టీమ్ 

మరి భారత ఆటగాళ్లు ఆడతారా..? 

Team India తరఫున ఆడుతున్న క్రికెటర్లెవరూ విదేశాలలో జరిగే ఏ లీగ్ లోనూ పాల్గొనడానికి వీళ్లేదు. ఒకవేళ అలా ఆడితే వాళ్లను భారత క్రికెట్ ఆడటానికి అనర్హులుగా ప్రకటిస్తారు. గతంలో పలువురు భారత క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, పరాస్ మంబ్రే విదేశీ లీగ్ లలో ఆడారు.  తాజాగా ఢిల్లీ ఆటగాడు ఉన్ముక్త్ చంద్ కూడా బిగ్ బాష్ ఆడటానికి వెళ్లాడు.  అయితే వీళ్లు భారత క్రికెట్ కు దారులు మూసుకుపోవడంతోనే విదేశీ లీగ్ లు ఆడారు. మరి త్వరలో జరుగబోయే ఈపీఎల్ లో భారత ఆటగాళ్లు ఆడతారా..?  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అందుకు ఒప్పుకుంటుందా..? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే కొద్దిరోజులుగా భారత్ కు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అవుతున్నది. గత ఐపీఎల్ తో పాటు ఇటీవలే ముగిసిన 14 వ సీజన్ రెండో దశ కూడా అక్కడే జరిగింది. ఇటీవల ప్రపంచకప్ కు కూడా యూఏఈ ఆతిథ్యమిచ్చింది. యూఏఈతో బీసీసీఐ కూడా మంచి సంబంధాలు నెలకొల్పుతున్నది. ఈ నేపథ్యంలో ఈపీఎల్ కోసం బీసీసీఐ నిబంధనలు మార్చే అవకాశమున్నట్టు బోర్డు వర్గాల సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios