ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2019 లో అత్యంత ప్రమాదకర ఆటగాడు ఎవరంటే టక్కున అండీ రస్సెల్ పేరు వినబడుతుంది. విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థి  బౌలర్లను ఊచకోత కోస్తూ భారీగా పరుగులు సాధించడం ఇతడి బ్యాటింగ్ స్టైల్. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న ఇతడు భారీ షాట్లతో విరుచుకుపడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇలా ఈ వెస్టిండిస్ ఆల్ రౌండర్ ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. 

గతంలో కూడా ఇతడు ఐపిఎల్ టోర్నీలో పాల్గొన్నా ఈ స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే తన ఆటతీరు మారి సూపర్ హిట్టర్ గా మారడం వెనుక వున్న రహస్యాన్ని రస్సెల్స్ తాజాగా బయటపెట్టాడు. వెస్టిండిస్ జట్టుకు చెందిన తన సహచర ఆటగాడు క్రిస్ గేల్ సలహాను పాటించడం మూలంగానే తన బ్యాటింగ్ స్టైల్  మారినట్లు అతడు వెల్లడించాడు. 

గత టీ20 ప్రపంచ కప్ టోర్నీలో తాను గేల్ తో కలిసి డ్రెస్సింగ్ రూం ను పంచుకున్నానని రస్సెల్స్ తెలిపాడు. ఈ సమయంలో తనకు అతడు చాలా విలువైన సలహాలు ఇచ్చాడన్నాడు. ముఖ్యంగా తాను వాడే బ్యాటును పట్టుకుని చూసి ఇంత తేలికైనది ఎందుకు వాడుతున్నావని ప్రశ్నించి...వెంటనే  బరువైన బ్యాట్ వాడమని సూచించాడట. తాను కూడా అలాగే వాడుతున్నానని...అందువల్లే భారీ షాట్లు బాదగలుగుతున్నానని గేల్ తన సీక్రెట్ చెప్పాడన్నాడు. అప్పటినుండి తానే బరువైన బ్యాట్ వాడటం మొదలుపెట్టానని రస్సెల్స్ వెల్లడించాడు. 

ఇక అప్పటినుండి తన బ్యాట్ తో పాటు బ్యాటింగ్ స్టైల్ మొత్తం మారిపోయిందని పేర్కొన్నాడు. బంతిని బలంగా బాదుతూ బౌండరీలు సాధించడం ఇలా బరువైన బ్యాట్ మూలంగానే సాధ్యమని తెలిపాడు. ప్రస్తుతం కోల్‌కతా జట్టులో ఆడుతున్న అందరి బ్యాట్ మెన్స్ కంటే తన బ్యాట్ బరువు ఎక్కువగా వుంటుందని...అదే తన సక్సెస్ సీక్రెట్ అని రస్సెల్స్ వెల్లడించాడు. 

ప్రస్తుత ఈ ఐపీఎల్‌ సీజన్ 12లో రస్సెల్స్  217.00  స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్నాడు. ఇలా సుమారు 66.00 సగటుతో ఇప్పటివరకు 392 పరుగులు చేశాడు. ఇందులో 41 సిక్సర్లు వుండటం విశేషం.