భారత్-వెస్టిండిస్ ల మధ్య జరగనున్న టీ20 సీరిస్ లో టీమిండియా క్రికెటర్లు ప్రత్యర్ధులతోనే కాదు సహచరులతో కూడా పోటీ పడుతున్నారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. అదేవిధంగా టీమిండియా తరపున అత్యంత వేగంగా వెయ్యి పరుగులను సాధించిన కోహ్లీ రికార్డును కూడా బద్దలుగొట్టేందుకు కూడా కెఎల్ రాహుల్ సిద్దమయ్యాడు. ఇలా వెస్టిండిస్ పై చెలరేగి టీ20 క్రికెట్లో పలు రికార్డులు బద్దలుగొట్టేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్దంగా వున్నారు.  

అయితే కేవలం కోహ్లీ రికార్డునే కాదు పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డును బద్దలుగొట్టే అరుదైన అవకాశం రాహుల్ ముందుంది. టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్సుల్లోనే  వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్న  రికార్డు గతంలో కోహ్లీ పేరిట వుండేది. అతడు కేవలం  27 ఇన్నింగ్సుల్లో ఈ ఘనతను సాధించాడు. అయితే ఈ పొట్టి క్రికెట్లో అద్భుతంగా రాణించిన పాక్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజమ్ కేవలం 26 ఇన్నింగ్సుల్లోనే 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఇలా కోహ్లీని  వెనక్కినెట్టి  అతడు మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. కానీ ఇప్పుడు బాబర్ రికార్డును బద్దలుగొట్టగా అరుదైన అవకాశం కెఎల్ రాహుల్ కు  వచ్చింది. 

రాహుల్ టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 24 ఇన్నింగ్సుల్లో 879 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఇవాళ వెస్టిండిస్ అతడు 25వ మ్యాచ్ ఆడనున్నాడు. ఇందులో అతడు సెంచరీ(121 పరుగులు) సాధిస్తే బాబర్ ఆజమ్ రికార్డు బద్దలవనుంది. అయితే శిఖర్ ధవన్ తిరిగి జట్టులోకి వచ్చాడు కాబట్టి  రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశాలు లేవు. కాబట్టి నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి టీ20ల్లో సెంచరీ సాధించడం చాలా కష్టం. అయితే అసాధ్యం మాత్రం కాదు. 

ఇక ఈ మ్యాచ్ లో కాకున్నా తర్వాతి మ్యాచ్ లో రాహుల్ 1000పరుగులను పూర్తి చేసుకుంటే కేవలం కోహ్లీ రికార్డు  బద్దలవుతుంది. కానీ 26 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించడం ద్వారా బాబర్ ఆజమ్ తో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలుస్తాడు. ఒకవేళ మొదటి టీ20లోనే 121 పరుగుల్ని బాదితే టీ20లో ఫాస్టెస్ట్‌ వెయ్యి పరుగుల రికార్డు రాహుల్ ఖాతాలోకి చేరుతుంది.