Lucknow Retained Players: ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ  ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలు మిగతా పనిని చకచకా పూర్తి చేస్తున్నాయి. పాత ఫ్రాంచైజీలలోని ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవడానికి ఆ జట్లకు  ఈనెల 22 ఆఖరుతేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే.

మరికొద్ది రోజులలో బెంగళూరు వేదికగా జరుగనున్న ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఈ లీగ్ లోకి వచ్చిన రెండు కొత్త ఫ్రాంచైజీలు (లక్నో, అహ్మదాబాద్)లు తాము రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్లను ఖరారు చేసుకున్నాయి. గతేడాది ముగిసిన ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీల బిడ్ ల వేలంలో మునుపెన్నడూ లేనంతగా.. ఏకంగా రూ. 7,090 కోట్లు పెట్టుబడులు పెట్టి లక్నో ఫ్రాంచైజీని దక్కించుకున్న సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ.. తాను రిటైన్ చేసుకోబోయే ముగ్గురు ఆటగాళ్ల వివరాలను ఖరారు చేసింది. ఎప్పట్నుంచో వినిపిస్తున్నట్టుగానే కెఎల్ రాహుల్ కు భారీ ధర దక్కగా.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్, పంజాబ్ సూపర్ కింగ్స్ మాజీ స్పిన్నర్ రవి బిష్ణోయ్ లనూ కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. 

సారథిగా ఉండనున్న కెఎల్ రాహుల్ (నెంబర్ వన్ ప్లేయర్) కు రూ. 15 కోట్లు చెల్లించనున్న లక్నో.. స్టోయినిస్ కు రూ. 11 కోట్లు, రవి బిష్ణోయ్ కు రూ. 4 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. దీని ప్రకారం ఆ జట్టు ఒక విదేశీ ఆటగాడు, ఇద్దరు స్వదేశీ ఆటగాళ్ల (అందులో రవి బిష్ణోయ్ అన్ క్యాప్డ్ ప్లేయర్) ను ఎంచుకుంది. ఈ ముగ్గురికి రూ. 30 కోట్లు వెచ్చించింది లక్నో యాజమాన్యం. 

ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక జట్టు ఆటగాళ్ల కొనుగోలులో రూ. 90 కోట్ల దాకా ఖర్చు చేయవచ్చు. దీని ప్రకారం చూస్తే లక్నో ఖాతాలో ఇంకా రూ. 60 కోట్లు నిల్వ ఉంటాయి. ఈ మొత్తంలోనే మిగిలిన జట్టును నిర్మించేందుకు అది ఖర్చు చేయాల్సి ఉంది. అయితే లక్నో జట్టు.. కెఎల్ రాహుల్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ ను సంప్రదించినా అతడు అడిగినంత ఇవ్వడంలో యాజమాన్యం మీనమేషాలు లెక్కించింది. దీంతో అతడు డిమాండ్ చేసినంత (రూ. 15 కోట్లు) ఇచ్చి సీవీసీ.. ఈ అప్ఘాన్ స్పిన్నర్ ను దక్కించుకున్నట్టు సమాచారం. 

ముగ్గురు ఆటగాళ్ల గత చరిత్ర.. 

ఇక గత రెండు సీజన్లలో పంజాబ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరించిన కెఎల్ రాహుల్.. తాజాగా ఆ జట్టు నుంచి బయటకు వచ్చాడు. రెండు సీజన్లలో పంజాబ్ ప్రదర్శన బాగాలేకున్నా ఆటగాడిగా మాత్రం రాహుల్.. ఫుల్ సక్సెస్ అయ్యాడు. 2020లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోగా.. 2021 లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో మూడో స్థానం అతడిదే. కానీ కెప్టెన్ గా మాత్రం అతడికి చెప్పుకోదగ్గ రికార్డులు ఏమీ లేవు. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అరంగ్రేటం చేసిన రాహుల్.. 2014లో ఎస్ఆర్హెచ్ కు ఆడాడు. 2016లో తిరిగి ఆర్సీబీకి వెళ్లాడు. 2018 ఐపీఎల్ వేలంలో అతడిని పంజాబ్ దక్కించుకుంది. 

ఇక మార్కస్ స్టోయినిస్.. 2015లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడుతూ ఐపీఎల్ లోకి రంగప్రవేశం చేశాడు. ఆ తర్వాత పంజాబ్, బెంగళూరు జట్లలో కూడా భాగమయ్యాడు. ఇప్పుడు లక్నోకు ఆడబోతున్నాడు. 

2020 అండర్-19 ప్రపంచకప్ లో అదరగొట్టిన రవి బిష్ణోయ్.. భారత సీనియర్ జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 2020 సీజన్ లో పంజాబ్ అతడిని రూ. 2 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ లో అతడు పంజాబ్ తరఫున ఆడుతూ.. 12 వికెట్లు పడగొట్టాడు. 

ఇదిలాఉండగా.. అహ్మదాబాద్ జట్టు కూడా తాము రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసింది. హర్ధిక్ పాండ్యా (రూ. 15 కోట్లు) సారథిగా వ్యవహరిస్తున్న ఈ జట్టు.. రషీద్ ఖాన్ (రూ. 15 కోట్లు), శుభమన్ గిల్ (రూ. 7 కోట్లు) లను కూడా రిటైన్ చేసుకున్నట్టు సమాచారం.