కరోనా నుంచి పూర్తిగా కోలుకోని కెఎల్ రాహుల్... వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి కూడా దూరం... త్వరలో బీసీసీఐ అధికారిక ప్రకటన! 

అనుకున్నదంతా అయ్యింది. గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న కెఎల్ రాహుల్, వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనూ పాల్గొనడం లేదు. ఎన్‌సీఏలో శిక్షణ పొందుతూ కరోనా బారిన పడిన కెఎల్ రాహుల్, ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో టీ20 సిరీస్‌కి అతను అందుబాటులో ఉండడం లేదు...

జూలై 21న కెఎల్ రాహుల్‌కి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. జర్మనీకి వెళ్లి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన లోకేశ్ రాహుల్, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో (NCA) వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రిహాబీటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు...

భారత సీనియర్ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బౌలింగ్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న కెఎల్ రాహుల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో త్వరలోనే కెఎల్ రాహుల్ తిరిగి జట్టుతో కలుస్తాడని భావించింది బీసీసీఐ. టీ20 వరల్డ్ కప్ 2022, ఆసియా కప్ వంటి మెగా టోర్నీలు రాబోతున్న తరుణంలో కెఎల్ రాహుల్ త్వరగా టీమ్‌కి అందుబాటులోకి రావాలని అభిమానులు కూడా ఆశించారు...

అయితే కరోనా బారిన పడిన కెఎల్ రాహుల్, ఐసోలేషన్‌లో గడుపుతున్నాడు. జూలై 26న బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్... ట్రిడినాడ్‌కి చేరుకున్నారు. కెఎల్ రాహుల్ ఫిట్‌గా ఉంటే ఈ విమానంలోనే వెస్టిండీస్‌కి చేరుకోవాల్సింది...

కెఎల్ రాహుల్‌ని పరీక్షించిన వైద్యులు, అతనికి కనీసం వారం రోజుల విశ్రాంతి అవసరమని సూచించారట. దీంతో అతను టీ20 సిరీస్‌కి అందుబాటులో ఉండడం లేదు. తొలుత మొదటి మూడు టీ20లు ముగిసిన తర్వాత కెఎల్ రాహుల్‌ని పంపించాలని భావించింది బీసీసీఐ...

అయితే కేవలం రెండు మ్యాచుల కోసం వెస్టిండీస్‌కి పంపించడం కంటే ఆ తర్వాత జరిగే జింబాబ్వే టూర్‌కి సిద్ధమయ్యేందుకు కెఎల్ రాహుల్‌కి తగినంత సమయం ఇవ్వడం భావ్యమని బీసీసీఐ పెద్దలు భావించారట. దీంతో అతను విండీస్ టూర్ మొత్తానికి దూరం కాబోతున్నాడు...

కెఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో అతనికి రిప్లేస్‌మెంట్‌గా ఏ ప్లేయర్‌గా సెలక్ట్ చేస్తారా? లేక వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్‌కి అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. కెఎల్ రాహుల్ అందుబాటులో లేకపోయినా రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేందుకు ఇషాన్ కిషన్ రూపంలో మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు...

అలాగే దీపక్ హుడా, రిషబ్ పంత్‌లను కూడా ఓపెనర్లు వాడి సక్సెస్ సాధించింది భారత జట్టు. దీంతో ప్రస్తుతం టీమిండియాకి నలుగురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు.

టీ20 సిరీస్‌లో మొదటి మూడు మ్యాచుల్లో తొలి టీ20 ట్రిడినాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరగబోతుంటే ఆ తర్వాత రెండు టీ20 మ్యాచులు సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్కులో జరుగుతాయి. ఆ తర్వాత ఆఖరి రెండు వన్డేలు యూఎస్‌ఏలో నిర్వహించబోతున్నారు...

ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవర్డ్ రిజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో నాలుగో, చివరి టీ20 మ్యాచులు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం టీ20 మ్యాచులన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి.