తన బౌలింగ్‌లో సిక్సర్లు, ఫోర్లు బాదారంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ కులదీప్ యాదవ్ కన్నీటి పర్యంతమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భాగంగా 16వ ఓవర్‌ను కుల్‌దీప్ వేశాడు.

ఈ సమయంలో క్రీజులో ఉన్న మొయిన్ అలీ అతని బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఏకంగా మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు బాది చివరి బంతికి ఔటయ్యాడు. అప్పటి వరకు మిగిలిన బ్యాట్స్‌మెన్లు కుల్‌దీప్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి నానా అవస్థలు పడ్డారు.

కానీ అలీ మాత్రం చితకబాదడంతో అతను భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీరు వస్తుండగా... సహచరుడు నితీశ్ రానా అతడిని ఊరడించాడు. డగౌట్ నుంచి ఓ ఆటగాడు మంచినీరు తీసుకొచ్చి అందించాడు.

అయితే కాసేపటికి కుల్‌దీప్ కంటతడి పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అతనిని ఓదారుస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఆటలో ఇలాంటివి సాధారణమేనంటూ కామెంట్లు పెడుతున్నారు.