ఆండ్రీ రస్సెల్స్... ధనాధన్ షాట్లతో విరుచుకుపడే స్పెషలిస్ట్ బ్యాట్ మెన్. అతడు క్రీజులో వున్నాడంటే ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాల్సిందే. ఇలా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును ఎన్నో మ్యాచుల్లో ఒంటిచేత్తో గెలింపించిన సత్తా రస్సెల్స్ సొంతం. ఇలా తన అత్యుత్తమ ప్రదర్శన జట్టు గెలుపు, అభిమానులను అలరించడం కోసం మాత్రమే కాదని... తన భార్యను ఆకట్టుకోవడం కోసం కూడా అని పేర్కొన్నాడు. ఆమెను ఎప్పుడూ తన ఆటతీరుతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటానని...అందువల్లే జాగ్రత్తగా గుర్తుండిపోయే ఇన్నింగ్సులు ఆడతానని రస్సెల్స్ వెల్లడించాడు. 

గత ఆదివారం రస్సెల్స్ పుట్టినరోజు. అదే రోజు ముంబైపై జరిగిన మ్యాచ్ లో అతడు తన విశ్వరూపం చూపించాడు. 8 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో కేవలం 40 బంతుల్లోనే 80 పరుగులు చేసి కెకెఆర్ ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. ఇలా పుట్టిన రోజు నాడు మరో భారీ ఇన్నింగ్స్ తో కెకెఆర్ విజయంలో అతడు కీలక పాత్ర పోషించాడు. 

మ్యాచ్ ముగిసిన అనంతరం రస్సెల్స్ తన భార్య జేసిమ్ లోరాతో కలిసి మీడియాతో మాట్లాడాడు. '' తాను ప్రతి మ్యాచ్ లో జట్టును గెలిపించాలని అనుకుంటా.. కానీ ఈ మ్యాచ్ మాత్రం తనకు ప్రత్యేకమైనది. పుట్టిన రోజున ఇలా భారీ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించడం ఆనందంగా వుంది.  ప్రతి మ్యాచ్ లో నేను అత్యుత్తమంగా ఆడటానికి ప్రయత్నిస్తాను. ఇలా అభిమానులను అలరించడంతో పాటు నా భార్యను ఆకట్టుకోవాలని చూస్తాను.'' అని రస్సెల్స్ వెల్లడించాడు.