టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనవసరంగా గెలికి కివీస్ ఆటగాడు జేమ్స్ నీషమ్ విమర్శలపాలవుతున్నాడు.  యాషెస్ సీరిస్ లో సెంచరీ సాధించిన ఇంగ్లాండ్  ఓపెనర్ రోరీ బర్న్స్ ను పొగడుతూ నీషమ్ సరదాగా కోహ్లీ పేరును వాడాడు.  అయితే భారత అభిమానులు మాత్రం అతడి కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్నారు. దీంతో  నీషమ్ పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం  కురుస్తోంది. 

ఏం  జరిగిందంటే...

ప్రస్తుతం ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ జరుగుతోంది. మొదటి  టెస్టులో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ టీంలో  ఓపెనర్ రోర్నీ బర్న్స్ సెంచరీ(125 పరుగులు) రాణించాడు. దీంతో నీషమ్ అతన్నిప్రశంసిస్తూ ఈ విధంగా ట్వీట్ చేశాడు. '' రోరీ బర్స్స్ ఫస్ట్ యాషెస్ ఇన్సింగ్ లోనే సెంచరీతో అదరగొట్టాడు. అతడు ఈ  ఒక్క ఇన్నింగ్స్ లో సాధించినన్ని పరుగులు కోహ్లీ యాషెస్ సీరిస్ మొత్తంలో సాధించలేకపోయాడు.'' అంటూ ఫన్నీగా కోహ్లీ పేరును వాడుకున్నాడు.

 

అయితే అభిమానులు మాత్రం నీషమ్ వ్యాఖ్యలను సరదాగా తీసుకోవడం లేదు. అతడు కావాలనే కోహ్లీని అవమానించాడని  ఆరోపిస్తూ అతడిపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. కొందరు నెటిజన్లయితే నీషమ్ ను బెదిరిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ''ప్రస్తుతం కెనడాలో టీమిండియా అభిమానులు ఎవరూ లేనట్టున్నారు. లేదంటే మీ దేశానికి నీవు ప్రాణాలతో వెళ్లేవాడికి కాదు.'' అంటూ నీషమ్ ట్వీట్ కే ఓ నెటిజన్ ఘాటుగా సమాధానమిచ్చాడు. 

'' న్యూజిలాండ్ టీం మొత్తం యాషెస్ సీరిస్ లో సాధించిన పరుగుల కంటే ఎక్కువ రోరీ  బర్న్స్ ఒక్క ఇన్నింగ్స్ లోనే సాధించాడు.'' అని నీషమ్ పేర్కొంటే బావుండేది. కానీ కోహ్లీ పేరును వాడటం ఖచ్చితంగా   అవమానించడమే అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. '' నువ్వు రంజీ క్రికెట్లో  1000  వికెట్లు 10000 పరుగులు  చేశావు కదా నీషమ్'' అంటూ మరొకరు ఎద్దేవా  చేశారు. ఇలా  నీషమ్ తో కోహ్లీ అభిమానులు ఓ ఆట ఆడుకుంటున్నారు.