Asianet News TeluguAsianet News Telugu

సన్‌రైజర్స్‌కు పంజాబ్ పంచ్: హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో వరుసగా రెండో ఓటమి చవిచూసింది. సోమవారం రాత్రి ఛండీగఢ్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది

kings xi punjab beat sunrisers hyderabad
Author
Hyderabad, First Published Apr 9, 2019, 7:35 AM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో వరుసగా రెండో ఓటమి చవిచూసింది. సోమవారం రాత్రి ఛండీగఢ్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ ‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగులకే బెయిర్‌స్టో ఔటయ్యాడు. అయితే విజయ్ శంకర్‌తో కలిసి డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.

పిచ్ నుంచి ఏ మాత్రం సహకారం లేకపోవడంతో అతను నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్‌రేట్ మరీ పడిపోకుండా చూశాడు. ఈ క్రమంలో వార్నర్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

చివరి వరకు బ్యాటింగ్ చేసిన వార్నర్ 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

పంజాబ్ బౌలర్లలో షమి, ముజీబ్ రెహ్మాన్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రమాదకర గేల్‌ను రషీద్ ఖాన్ పెవిలియన్‌కు పంపాడు.

అయితే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ జోడి ధాటిగా బ్యాటింగ్ చేసింది. దీంతో 17 ఓవర్లకు జట్టు స్కోరు 132/1 ఈ దశలో పంజాబ్ విజయం ఖాయమని అనిపించింది. అయితే 18 ఓవర్‌లో సుదీప్ శర్మ.. మయాంక్ అగర్వాల్, మిల్లర్‌లను ఔట్ చేసి మూడు పరుగులే ఇవ్వడంతో.... చివరి రెండు ఓవర్లలో పంజాబ్ 16 పరుగులు చేయాల్సి వచ్చింది.

19 ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిద్ధార్థ్ కౌల్.. మన్‌దీప్ సింగ్‌ను ఔట్ చేసి ఐదు పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం కాగా రాహుల్ (71) అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్నందించాడు.

హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ 2, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ తలో వికెట్ పడగొట్టారు. ఇవాళ్టీ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios