హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్‌పై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ. ‘హెచ్‌సీఏ, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కి సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చడం మానుకోవాలి.

జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధిపై ఆయన మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు...’ అని చెప్పిన లక్ష్మీనారాయణ, అజర్‌పై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసు ఇంకా సుప్రీంలో పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు.

‘మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అజర్‌కి కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే దొరికింది. దాంతో ఆయన హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతి తెచ్చుకున్నాడు. ఆ కేసును సీబీఐతో విచారణ జరిపించి, అసలు నిజాలు బయటికి తేవాలి’ అన్నారు టీసీఏ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ.

టీసీఏ సెక్రటరీ ధరం గురువా రెడ్డి మాట్లాడుతూ... ‘తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, సుప్రీం కోర్టు నుంచి, బొంబాయ్ హైకోర్టు నుంచి అవసరమైన అనుమతులు ఇప్పటికే సంపాదించింది. కేవలం బీసీసీఐ దగ్గరే గుర్తింపు కోసం దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే 3 వేలకు పైగా బీసీసీఐ ఫార్మాట్‌ లీగులు, టోర్నీలు నిర్వహించాం.

వందల మంది యువ క్రికెటర్లను వెలుగులోకి తెచ్చాం. హెచ్‌సీఏలో జరుగుతున్న అవినీతి కారణంగా ఎంతో మంది యువ క్రికెటర్లు నష్టపోతున్నారు. హెచ్‌సీఏ చేస్తున్న అక్రమాలు, అవినీతిపై కేంద్ర మంతి అమిత్ షాను కలిసి వివరించబోతున్నాం’ అని చెప్పారు.  

జూలైలో టీసీఏ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించబోతున్నామని, 8 జట్లు పాల్గొనే ఇందులో తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలిపారు.