చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పేలవ ప్రదర్శన కపబర్చాడు. తనకంటే తక్కువ ర్యాంకు క్రీడాకారుడితో తలపడిన ఓటమిపాలైన అతడు తొలిరౌండ్ నుండే  ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్ లో మిశ్రమ ఫలితాలు లభించగా మహిళా సింగిల్స్ లో మాత్రం మన బ్యాడ్మింటన్ ప్లేయర్లు ముందుకు  దూసుకుపోయారు. 

ఏసిబి టోర్నమెంట్ లో రెండో రోజు పలువురు భారత క్రీడాకారులు బరిలోకి దిగారు. ఇందులో భాగంగా పురుషుల సింగిల్ విభాగంలో ప్రపంచ ఐదో సీడ్ శ్రీకాంత్ 51వ ర్యాంకర్ అయిన ఇండోనేషియా ఆటగాడు హిరెన్ రుస్తావిటో చేతిలో ఓటమిపాలయ్యాడు.  శ్రీకాంత్‌ 16-21, 20-22తో వరుస సెట్లను కోల్పోయి పరాజయం పాలయ్యాడు. 

ఇక ఈ మెగా టోర్నీలో భారత ఫేవరెట్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ లకు మాత్రం శుభారంభం లభించింది. మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్లో నాలుగో సీడ్‌ పివి సింధు 21-14, 21-7తో జపాన్ క్రీడాకారిణి తకహషి సయాక పై గెలిచింది. అలాగే మరో స్టార్ షట్లర్,ఏడో సీడ్‌ సైనా నెహ్వాల్ 12-21, 21-11, 21-17తో చైనా క్రీడాకారిణి హాన్‌ యూ పై నెగ్గి రెండోరౌండ్‌ చేరింది.  


పురుషుల సింంగిల్స్ విభాగంలో మరో భారత ఆటగాడు సమీర్‌ వర్మ 21-13, 17-21, 21-18తో జపాన్ షట్లర్ సకాయి కజుమసా ను ఓడించి రెండోరౌండ్‌ చేరాడు. మహిళల డబుల్స్ విభాగంలో జక్కంపూడి మేఘన-పూర్వీశా రామ్‌ 13–21, 16–21తేడాతో, దండు పూజ–సంజన సంతోష్‌ 13–21, 21–12, అపర్ణ బాలన్‌–శ్రుతి 12–21, 10–21  తేడాతో ఓమిపాలయ్యారు.  పురుషుల డబుల్స్‌ లో  అర్జున్‌–శ్లోక్‌ రామచంద్రన్‌  18–21, 15–21తో పరాజయంపాలై ఇంటిముఖం పట్టారు.