టీమిండియా బౌలరు నటరాజన్ మీద న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. నటరాజన్ తో కలిసి ఆడడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు విలియమ్సన్ చెప్పాడు.
న్యూఢిల్లీ: టీమిండియా బౌలర్ నటరాజన్ మీద న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. నటరాజన్ అద్భుతమైన వ్యక్తి అని, ఐపీఎల్ టోర్నీలో గొప్పగా రాణించాడని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని ఆయన అన్నాడు. వాస్తవానికి నటరాజన్ నెట్ బౌలర్ గా ఆస్ట్రేలియా వెళ్లాడని, అయితే వారవారానికి అతనికి అవకాశాలు మెరుగుపడ్డాయని, గబ్బా టెస్టులో టీమిండియా విజయంలో అతని పాత్ర కూడా ఉండడం నిజంగా సంతోషకరమని విలియమ్సన్ అన్నాడు.
అంతటి ప్రతిభ ఉన్న వ్యక్తి తనకు సహచర ఆటగాడు కావడం గర్వంగా ఉందని అన్నాడు. ఐపిఎల్ లో ఇరువురు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో నటరాజన్ తో కలిసి ఆడడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
తనతో కలిసి ఆడిన నటరాజన్ ఆస్ట్రేలియా పర్యటనలో సాధించిన విజయం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. ఐపిఎల్ 2020 సీజన్లో సన్ రైజర్స్ తరఫున ఆడిన నటజరాన్ 16 వికెట్లు తీశాడు. దాంతో అతను ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్ గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టిన నటరాజన్ ఆ తర్వాత టీ20, టెస్ట్ క్రికెట్ లో కూడా అడుగు పెట్టాడు.
మూడు ఫార్మాట్లలో కలిపి అతను 11 వికెట్లు తీశాడు. వన్డేల్లో 2, టీ20లో 6, టెస్టుల్లో 3 వికెట్లు తీశాడు. దీంతో నటరాజన్ పై అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా, విలియమ్సన్ జాతీయ మీడియాతో మాట్లాడాడు. నటరజాన్ చాలా నిరాడంబరంగా ఉంటాడని, అద్భుతమైన ప్రతిభ కలవాడని, టీమిండియాకు లభించిన మంచి ఆటగాడని విలియమ్సన్ అన్నాడు. తక్కువ సమయంలోనే యువ క్రికెటర్ నుంచి పరిణతి కలిగిన ఆటగాడగా మార్పు చెందాడని ఆయన అన్నాడు.
