తెలుగువాళ్లు కాకపోయినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడతారనే మమకారంతో డేవిడ్ వార్నర్‌ను ‘డేవిడ్ భాయ్’, కేన్ విలియంసన్‌ను ‘కేన్ మామ’... మనీశ్ పాండేను ‘మనీశ్ అన్న’ అంటూ పిలుస్తుంటారు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు. సోషల్ మీడియాకే పరిమితమైన ఈ అభిమానం, ఇప్పుడు వారిదాకా వెళ్లింది.

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా మొదటి మూడు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది.

గాయం కారణంగా మొదటి మూడు మ్యాచులకు దూరమైన కేన్ విలియంసన్, ఈ మ్యాచ్‌లో బరిలో దిగిన విషయం తెలిసిందే. తొలి విజయం అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ రూమ్‌లో జరిగిన సమావేశంలో ఆరెంజ్ ఆర్మీ కోచ్ ట్రేవర్ బేలీస్, కేన్ విలియంసన్‌ను కేన్ మామ అంటూ సంబోధించాడు.

దీంతో మిగిలిన టీమ్ ప్లేయర్లు కూడా ‘కేన్ మామ... కేన్ మామ’ అంటూ అరిచారు. ఈ వీడియోను పోస్టు చేసిన సన్‌రైజర్స్, ‘కేన్ విలియంసన్ అంటే ప్రేమ, కేన్ మామ అంటే ఎమోషన్’ అంటూ కాప్షన్‌ను జత చేసింది. కేన్ ఎంట్రీతోనే విజయం దక్కడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కేన్ విలియంసన్ లక్కీ ప్లేయర్ అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.