Kalyan Chaubey: గత నెలలో ఏఐఎఫ్ఎఫ్ లో థర్డ్ పార్టీ జోక్యం పెరిగిపోయిందని ఆరోపిస్తూ ఫిఫా.. భారత ఫుట్బాల్ పై నిషేధం విధించింది. దీంతో ఏఐఎఫ్ఎఫ్ కు ఎన్నికలు నిర్వహించారు.
భారత్‌లో ఫుట్బాల్ అంటే గుర్తొచ్చే పేరు బైచుంగ్ భుటియా. దాదాపు దశాబ్దంన్నరకు పైగా ఫుట్బాల్ కు ఎనలేని సేవలందించిన భుటియా.. ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఎన్నికల్లో దారుణంగా ఓడాడు. టీమిండియా మాజీ ఫుట్బాల్ ఆటగాడు, ప్రస్తుతం బెంగాల్ లో బీజేపీ నాయకుడిగా ఉన్న కళ్యాణ్ చౌబే.. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష ఎన్నికలలో భాగంగా మొత్తం 34 ఓట్లలో భుటియాకు ఒక్కటంటే ఒక్కటే ఓటు రాగా.. కళ్యాణ్ చౌబేకు ఏకంగా 33 మంది మద్దతు తెలిపారు. దీంతో ఆయన ఏఐఎఫ్ఎఫ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
గత నెలలో ఏఐఎఫ్ఎఫ్ లో థర్డ్ పార్టీ జోక్యం పెరిగిపోయిందని ఆరోపిస్తూ ఫిఫా.. భారత ఫుట్బాల్ పై నిషేధం విధించింది. దీంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని పాత కార్యవర్గాన్ని రద్దు చేసి కొత్త సభ్యుల కోసం ఎన్నికలు జరపాలని సూచించింది.
ఈ మేరకు జరిగిన ఎన్నికలలో కళ్యాణ్ చౌబే 33 ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఏఐఎఫ్ఎఫ్ ఉపాధ్యక్షుడి పదవికి గాను కర్నాటక ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడైన ఎన్.హరిస్ గెలిచాడు. రాజస్తాన్ కు చెందిన మన్వేందర్ సింగ్ పై హరిస్ విజయం సాధించాడు. ట్రెజరరీ పోస్టును అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన కిపా అజయ్ దక్కించుకున్నాడు. ఇదిలాఉండగా.. 85 ఏండ్ల భారత ఫుట్బాల్ చరిత్రలో ఒక మాజీ ఫుట్బాలర్ ఏఐఎఫ్ఎఫ్ కు అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే ప్రథమం.
ఎవరీ కళ్యాణ్ చౌబే..
బెంగాల్ కు చెందిన కళ్యాణ్ చౌబే గతంలో ఫుట్బాల్ క్రీడాకారుడు. అండర్-19 స్థాయి నుంచే బెంగాల్ కు ప్రాతినిథ్యం వహించాడు. మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఆయన భారత సీనియర్ ఫుట్బాల్ జట్టుకు పలుమార్లు ఎంపికైనా ఎన్నడూ ఆడే అవకాశం రాలేదు. కానీ రాష్ట్ర, క్లబ్ స్థాయిలలో మాత్రం విరివిగా ఆడేవాడు. 2015లో చౌబే బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు.
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చౌబే.. బెంగాల్ లోని కృష్ణానగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. కానీ తృణమూల్ అభ్యర్థి మహువా మోయిత్రా చేతిలో ఓడాడు. ఆ తర్వాత బీజేపీలో చురుకుగా పని చేస్తున్నాడు. ఇక ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష ఎన్నికలలో ఆయన గెలవడానికి బీజేపీ వెనుకనుంచి చక్రం తిప్పిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
