Asianet News TeluguAsianet News Telugu

బ్యాడ్ లక్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన జానీ బెయిర్‌స్టో! అప్పుడు అలా, ఇప్పుడేమో 99 పరుగులు చేసి..

మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన జానీ బెయిర్‌స్టో... 592 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై 273 పరుగుల ఆధిక్యం...

Johnny Bairstow missed well deserved century, after scoring 99 in the Ashes 2023, England vs Australia CRA
Author
First Published Jul 21, 2023, 8:47 PM IST

గాయంతో దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్‌కి దూరంగా ఉండి రీఎంట్రీ ఇచ్చాడు జానీ బెయిర్‌స్టో. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్టులో వివాదస్పద రీతిలో అవుట్ అయ్యాడు బెయిర్‌స్టో. ఓవర్ అయిపోయిందని భావించిన బెయిర్‌స్టో లైను దాటగా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ వికెట్లను గిరాటేశాడు. ఈ అవుట్ గురించి చాలా పెద్ద చర్చే జరిగింది..

తాజాగా మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన జానీ బెయిర్‌స్టో... సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయాడు. మూడంకెల స్కోరుని 1 పరుగు తేడాతో మిస్ చేసుకున్నా, అద్బుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌కి అదిరిపోయే ఆధిక్యం అందించాడు.  తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది..

మార్నస్ లబుషేన్ 51, మిచెల్ మార్ష్ 51, ట్రావిస్ హెడ్ 48, స్టీవ్ స్మిత్ 41, మిచెల్ స్టార్క్ 36, డేవిడ్ వార్నర్ 32, అలెక్స్ క్యారీ 20 పరుగులు చేసి సంయుక్తంగా రాణించారు. క్రిస్ వోక్స్ 5 వికెట్లు తీశాడు. 

బెన్ డక్లెట్ 1 పరుగుకే అవుట్ అయినా జాక్ క్రావ్లే సెన్సేషనల్ సెంచరీ బాదాడు. 182 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 189 పరుగులు చేసిన జాక్ క్రావ్లే, మొయిన్ ఆలీతో 121, జో రూట్‌తో కలిసి 206 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు..

మొయిన్ ఆలీ 54, జో రూట్ 84, హారీ బ్రూక్ 61, బెన్ స్టోక్స్ 51 పరుగులు చేసి అవుట్ అయ్యారు. క్రిస్ వోక్స్ డకౌట్ కాగా మార్క్ వుడ్ 6, స్టువర్ట్ బ్రాడ్ 7, జేమ్స్ అండర్సన్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు...

క్రిస్ వోక్స్ అవుటైన తర్వాత మార్క్‌వుడ్‌తో కలిసి 20 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్‌తో మరో 20 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 526 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్..

18 బంతులు ఆడి ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన జేమ్స్ అండర్సన్‌తో కలిసి ఆఖరి వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు జానీ బెయిర్ స్టో. 81 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 99 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో... సెంచరీకి 1 పరుగు దూరంలో ఉండగా జేమ్స్ అండర్సన్‌ని కామెరూన్ గ్రీన్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 592 పరుగులకి తెరపడింది. జానీ బెయిర్‌స్టో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన ఏడో క్రికెటర్ జానీ బెయిర్‌స్టో. ఇంతకుముందు జోఫ్రె బాయ్‌కాట్, స్టీవ్ వా, అలెక్స్ టూడర్, షాన్ పోలాక్, ఆండ్రూ హాల్, మిస్బా వుల్ హక్ 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 

జానీ బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌తో 592 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై 273 పరుగుల ఆధిక్యంలో సంపాదించింది. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఉస్మాన్ ఖవాజా 18 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios