కేఎల్ రాహుల్ కి బౌలింగ్ చేయడం కష్టం, ఉతికి ఆరేస్తాడు: జోఫ్రా ఆర్చర్
భారతీయ బ్యాట్స్ మెన్ లలో ఎవరికీ బౌలింగ్ చేయడంకష్టంగా భావిస్తావు అని ఆర్చర్ ను ప్రశ్నించగా ... కేఎల్ రాహుల్ అని సమాధానమిచ్చాడు. ఒకటి రెండు సార్లు తన బౌలింగ్ లో రాహుల్ చితక బాదాడని ఆర్చర్ అన్నాడు.
ఇతర క్రికెటర్ల లాగానే ఈ లాక్ డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్, రాజస్థాన్ రాయల్స్ టీం సభ్యుడు జోఫ్రా ఆర్చర్ తాజాగా తన రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడి ఇష్ సోదితో ఒక ఇంస్టాగ్రామ్ సెషన్ లో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా భారతీయ బ్యాట్స్ మెన్ లలో ఎవరికీ బౌలింగ్ చేయడంకష్టంగా భావిస్తావు అని ఆర్చర్ ను ప్రశ్నించగా ... కేఎల్ రాహుల్ అని సమాధానమిచ్చాడు. ఒకటి రెండు సార్లు తన బౌలింగ్ లో రాహుల్ చితక బాదాడని ఆర్చర్ అన్నాడు.
రాహుల్ పేరు ఆర్చర్ చెప్పగానే సోది కూడా వెంటనే అంగీకారం తెలుపుతూ... రాయల్స్ తో గత సీజన్లో ఆడినప్పుడు క్రికెట్ గ్రౌండ్ షేప్ ని, చిన్న బౌండరీలు తనకు అనుకూలంగా మలుచుకొని ఫోర్లు, సిక్సర్లు సాధించాడని అన్నాడు.
గత సీజన్లో రాహుల్ రెండవ అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. అతడి సూపర్ పెర్ఫార్మన్స్ అతనికి ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్సీ బాధ్యతలను వరించేలా చేసింది.
ఈ కరోనా వైరస్ మహమ్మారి గనుక లేకుండా ఉంటే... ఈపాటికి ఐపీఎల్ జోరుగా సాగుతుండేది. కానీ ఈ మహమ్మారి విసిరినా పంజా దెబ్బకు ఐపీఎల్ ఊసే లేకుండా పోయింది. ఐపీఎల్ ఎప్పుడు నిర్వహిస్తారు అనేదానిపై ఎటువంటి క్లారిటీ లేక నిరవధికంగా వాయిదాపడ్డ విషయం తెలిసిందే!
ఇకపోతే... ఐపీఎల్ ను నిర్వహించేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు తన ఆసక్తిని బీసీసీఐకి తెలపగా.. తాజాగా ఈ జాబితాలోకి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వచ్చింది. భారత్‌లో వాయిదాపడిన ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ బోర్డు తెలిపింది.
దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందిస్తూ...ఐపీఎల్ నిర్వహణకు యూఏఈ ముందుకు వచ్చిందని, అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు పూర్తి స్థాయిలో అనుమతులు లేని నేపథ్యంలో దాని గురించి మాట్లాడలేమన్నారు.
మరోవైపు యూఏఈకి గతంలోనే ఐపీఎల్ నిర్వహించిన అనుభవం వుంది. 2014లో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ 20 మ్యాచ్‌లు జరిగిన సంగతి తెలిసిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బయో సెక్యూర్ స్టేడియాలపై కసరత్తులు ప్రారంభించింది.