ఐపీఎల్ 2021 సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ ఆడతాడా? లేదా? అనే అనుమానాలకు తెర పడింది. రాజస్థాన్ రాయల్స్‌ జట్టులో స్టార్ ప్లేయర్‌గా మారిన ఆర్చర్, గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడాలని నిర్ణయించుకుననాడు. ఆర్చర్‌ కుడిచేతి మధ్యవేలుకి గాయమైంది. 

కొన్నాళ్లుగా ఈ గాయాన్ని భరిస్తూనే క్రికెట్ ఆడుతున్నాడు ఆర్చర్. తాజాగా గాయాన్ని పరీక్షించిన వైద్యులు, అందులో గాజు ముక్క ఉన్నట్టు గుర్తించారు. సోమవారం శస్త్రచికిత్స ద్వారా గాజు ముక్కను తొలగించారు. దాంతో రాజస్థాన్ రాయల్స్‌ నాలుగు మ్యాచులు ఆడిన తర్వాత జట్టుతో కలవబోతున్నాడు జోఫ్రా ఆర్చర్.

ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది ఆర్ఆర్. ఈ నాలుగు మ్యాచులు ముగిసిన తర్వాత ఆర్చర్ జట్టుతో కలుస్తాడని సమాచారం.