జోఫ్రా ఆర్చర్... ఈ ఇంగ్లాండ్ స్టార్ పేసర్ ఆట కంటే కూడా అతను వేసిన ట్వీట్లు చాలా ఫేమస్. ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగినా, దాని గురించి అప్పుడెప్పుడో జోఫ్రా ఆర్చర్ వేసిన పాత ట్వీట్ బయటికి వస్తూ ఉంటుంది. అందుకే జోఫ్రా ఆర్చర్‌ను ‘ఆర్చర్ బాబా’ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు.

తాజాగా టీమిండియాతో జరిగిన నాలుగో టీ20లో 8 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన జోఫ్రా ఆర్చర్, భారత జట్టు గుండెల్లో గుబులు రేపాడు. ఆఖరి ఓవర్‌లో ఆర్చర్ ఓ సిక్సర్, ఫోర్ బాదడంతో విజయానికి 3 బంతుల్లో 11 పరుగులు కావాల్సిన పరిస్థితికి వచ్చేసింది ఇంగ్లాండ్.

ఆర్చర్ బాదుడుకి ఒత్తిడికి గురైన శార్దూల్ ఠాకూర్, వరుసగా రెండు వైడ్లు కూడా వేశాడు. ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కి యత్నించిన ఆర్చర్ బ్యాటు విరిగిపోయింది. సింగిల్ మాత్రమే వచ్చింది.

ఈ సంఘటనతో 2018లో ఆర్చర్ వేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘యూకేలో బ్యాట్ రిపేర్ చేయడానికి ఎవరైనా మంచి పనివాళ్లు ఉన్నారా’ అంటూ మూడేళ్ల క్రితం ఆర్చర్ వేసిన ట్వీట్, ఇప్పుడు ఈ సంఘటనతో వెలుగులోకి వచ్చింది.