వరల్డ్ కప్ కు ముందు ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన వన్డే సీరిస్ ఇరు జట్లను డైలామాలోకి నెట్టినట్లుంది. అందువల్లే ఈ రెండు జట్టు తమ ప్రపంచ కప్ జట్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే పాక్ గతంలో ప్రకటించిన ప్రపంచ కప్ జట్టులో మార్పులు చేయగా... ఇప్పుడు అదే బాటలో ఇంగ్లాండ్ నడుస్తోంది. 

తాజాగా ఇంగ్లాండ్ జట్టులో మూడు మార్పులు చేస్తూ సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది.  ముందుగా ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న డేవిడ్ విల్లి, జో డెన్లీ, అలెక్స్ హేల్స్ లు తాజాగా  జట్టులో చోటు కోల్పోయారు. వారి స్థానాల్లో జోప్రా ఆర్చర్, లియాన్ డాసన్, జేమ్స్ విన్సీలు స్వదేశంలో జరిగే ప్రపంచ కప్ మెగా టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని కొట్టేశారు. 

వీరిలో హేల్స్ డ్రగ్ టెస్టులో విఫలమవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఇక మిగతా ఇద్దరు మాత్రం వారి ఇటీవల కాలంలో జరిగిన సీరీసుల్లో విఫలమవడంతో ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని చేజేతులా  వదులుకున్నారు. 
    
ఇంగ్లాండ్ గతంలో ప్రకటించిన  15 మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన ఆర్చర్ కాస్త ఆలస్యంగా అయినా జట్టులో చేరాడు. స్వదేశంలో ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని కల్పించిన ఈసిబికి ఆర్చర్ కృతజ్ఞతలు తెలిపాడు.     

 ఇంగ్లాండ్ జట్టు:

ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జోనీ బెయిర్‌ స్టో, జాసన్‌ రాయ్‌, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌, లియామ్‌ ప్లంకెట్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌వుడ్‌, జేమ్స్‌ విన్సీ, టామ్‌ కురాన్‌, లియామ్‌ డాసన్‌, జోఫ్రా ఆర్చర్‌