Asianet News TeluguAsianet News Telugu

సెలబ్రేషన్ పేరుతో ముక్కు పగలకొట్టారు... బిగ్‌బాష్ లీగ్ ఫైనల్‌లో జే రిచర్డ్‌సన్‌కి...

బిగ్‌బాష్ లీగ్ 2021-22 టైటిల్ విజేగా పెర్త్ స్కాచర్స్... ఫైనల్‌లో చిత్తుగా ఓడిన సిడ్నీ సిక్సర్స్... టైటిల్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో జే రిచర్డ్‌సన్‌కి గాయం...

Jhye Richardson bleeds through nose after Celebrations in BBL Final, Perth Scorchers
Author
India, First Published Jan 29, 2022, 11:50 AM IST

విజయం ఇచ్చే కిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఆనందం పట్టలేక ఎగిరి గంతులేస్తుంటారు ప్లేయర్లు. అయితే విన్నింగ్ సెలబ్రేషన్స్ పేరుతో తన జట్టు ప్లేయర్ ముక్కు పగులగొట్టాడం మాత్రం నిజంగా చాలా పెద్ద విషయమే... ఆస్ట్రేలియా యంగ్ బౌలర్ జే రిచర్డ్‌సన్‌కి సరిగ్గా ఇలాంటి విచిత్ర అనుభవమే ఎదురైంది. 

బిగ్ బాష్ లీగ్ 2021-22 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో పెర్త్ స్కాచర్స్ జట్టు, సిడ్నీ సిక్సర్స్ జట్టును చిత్తు చేసి, టైటిల్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్నాచర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది...
 
కే ప్యాటర్సన్ 1, జోష్ ఇంగ్లీష్ 13, మిచెల్ మార్ష్ 5, కొలిన్ మున్రో 1 పరుగు చేసి అవుట్ కావడంతో 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది పెర్త్ స్కాచర్స్. ఈ దశలో అస్టన్ టర్నర్ 35 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు, లారీ ఎవన్స్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

172 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సిడ్నీ సిక్సర్స్ జట్టు 16.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. డానిల్ హ్యూజ్స్ 33 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి రనౌట్ కాగా నికోలస్ బెర్టస్ 15 బంతుల్లో 15 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ జో లెంటన్ 10 పరుగులు చేయగా మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు...

ఆండ్రూ టై 3 వికెట్లు తీయగా జాసన్ బెరెండ్రాఫ్, అస్టన్ టర్నర్, పీటర్ హజోగ్లూ, అస్టర్ అగర్ తలా ఓ వికెట్ తీశారు. 2 వికెట్లు తీసిన జే రిచర్డసన్, స్టీవ్ ఓకీఫ్‌ను అవుట్ చేయడంతో 79 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది పెర్త్ స్కాచర్స్...

స్టీవ్ ఓకీఫ్ వికెట్ తీసిన వెంటనే న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ మున్రో జోష్‌తో అరుస్తూ దూసుకొచ్చి వేగంగా జే రిచర్డ్‌సన్‌ను ఢీకొట్టాడు. దాంతో జే రిచర్డ్‌సన్ ముక్కుకి బలంగా తగలడంతో గాయమై రక్తం కారింది. రక్తం కారుతున్నా నవ్వుతూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న జే రిచర్డ్‌సన్, అలాగే టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం...

బిగ్‌ బాష్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న పెర్త్ స్నాచర్స్, నాలుగో టైటిల్‌ను సొంతం చేసుకుంది. మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన పెర్త్ స్కాచర్స్ జట్టు, రెండు సార్లు మూడో స్థానంతో సరిపెట్టుకుంది... 

‘వాడు నా ముక్కు పగలగొట్టాడు... అందరం సెలబ్రేట్ చేసుకుంటుంటే తన భుజం నా ముక్కుకి తగిలింది... నేను కేవలం రెండు మ్యాచులే ఆడాను. జట్టు అంతా కలిసికట్టుగా ఆడడం వల్లే గెలిచాం...’ అంటూ చెప్పుకొచ్చాడు జే రిచర్డ్‌సన్...

ఐపీఎల్ 2021 వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు, జే రిచర్డ్‌సన్‌ని రూ.14 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే కరోనా సెకండ్‌ వేవ్ కేసులకు భయపడి, ఐపీఎల్ ఫస్టాఫ్‌లోనే స్వదేశానికి వెళ్లిపోయిన రిచర్డ్‌సన్, సెకండ్ ఫేజ్‌లో పాల్గొనలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios