ప్రపంచ కప్ ఆరంభానికి ముందు బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించడంతో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే లక్ష్యచేధనకు దిగి దాటిగా బ్యాటింగ్ చేస్తూ ప్రమాదకరంగా మారుతున్న బంగ్లా ఓపెనర్లను యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా విడదీశాడు. అంతేకాదు అదే ఓవర్లో ఓ అద్భుతమైన యార్కర్ తో మరో వికెట్ కూడా  పడగొట్టిప అతడు భారత విజయానికి పునాది వేశాడు.   

రెండో వార్మప్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కేఎల్‌ రాహుల్‌ (99 బంతుల్లో 108 పరుగులు), ధోని (78 బంతుల్లో 113 పరుగులు) సెంచరీలతో అదరగొట్టడంతో 359 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ  లక్ష్యాన్ని చేధించే   క్రమంలో ఓపెనర్లు లిట్టర్ దాస్(75 పరుగులు), సౌమ్య సర్కార్ (25 పరుగులు) బంగ్లాకు శుభారంభాన్నిచ్చారు. అయితే బుమ్రా తన తొమ్మిదో ఓవర్లో ఓ అద్భుతమైన బంతికి సౌమ్య సర్కార్ ను పెవిలియయన్ కు పంపి ఓపెనింగ్ జోడీపి విడదీశాడు. ఆ తర్వాత బంతికే మరో అద్భుతమైన యార్కర్ తో షకీబల్ హసన్ ను డకౌట్ చేసి భారత శిబిరాన్ని గెలుపు దిశగా నడిపించాడు. 

అయితే షకీబల్ హసన్ ను బోల్తాకొట్టించడానికి బుమ్రా వాడిన యార్కర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. 141 కిలోమీటర్ ఫర్ హవర్ వేగంతో దూసుకొచ్చిన యార్కర్ షకీబ్ అంచనాలకు అందకుండా వికెట్లను గిరాటేసింది. దీంతో అతడు డకౌటై పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.  

ఈ అద్భుత యార్కర్ ను ఐసిసి కూడా ప్రశంసించకుండా వుండలేకపోయింది. క్రికెట్ వరల్డ్ కప్ పేరుతో నిర్వహిస్తున్న ట్విట్టర్ ద్వారా దీని గురించి ఈ విధంగా స్పందించింది.  ''ఎంత గొప్ప బంతో ఇది... అద్భుతమైన బుమ్రా యార్కర్ కు షకీబల్ హసన్ బోల్తాపడ్డాడు'' అంటూ ఈ  వీడియోను కూడా జతచేస్తూ ట్వీట్ చేసింది. 

ఇలా ఈ మ్యాచ్ లో బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. అంతేకాకుండా అతడు చాలా పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం  25 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇక స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేందన్ చాహల్ మూడేసి వికెట్లు పడగొట్టి బంగ్లా ఓటమిని శాసించారు. ఇలా బౌలర్ల విజృంభణతో బంగ్లా 49.3 ఓవర్లలో 264 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో టీమిండియా  95 పరుగుల తేడాతో గెలుపొందింది.