న్యూఢిల్లీ: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో ఏడు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలరుగా రికార్డులకు ఎక్కాడు. శ్రీలంక బౌలర్ కులశేఖర పేరిట ఉన్న రికార్డును అతను బ్రేక్ చేశాడు. 

58 టీ20లు ఆడిన కులశేఖర ఆరు మెయిడిన్ ఓవర్లు వేశాడు. న్యూజిలాండ్ పై జరిగిన చివరి ఐదో టీ20లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా ఓ మెయిడిన్ ఓవరు వేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. 

Also Read: చివరి టీ20, నరాలు తెగే ఉత్కంఠ: పక్కపక్కనే కూర్చొన్న కోహ్లీ, విలియమ్సన్

న్యూజిలాండ్ సిరీస్ అంతగా రాణించని బుమ్రా చివరి ట్వంటీ20లో మాత్రం తన సత్తా చాటాడు. బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఐదో వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో కివీస్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. 

జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని భారత ఫాస్ట్ బౌలర్లు కేవలం 25 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నారు. తద్వారా 7.2 వేసిన ఫాస్ట్ బౌలర్లు న్యూజిలాండ్ ను 156 పరుగులకే పరిమితం చేయగలిగారు. భారత్ చేసిన 163 పరుగులను అధిగమించలేక కివీస్ కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది.

Also Read: ఐదో టీ20: అదే ఉత్కంఠ.. కివీస్‌పై భారత్‌దే విజయం, సిరీస్ క్లీన్ స్వీప్

మ్యాచ్ కు సారథ్యం వహించిన రోహిత్ శర్మ 60 పరుగులు చేశాడు. చివరి టీ20 మ్యాచునైనా గెలిచి ఊరట పొందాలనుకున్న కివీస్ కు ఆశాభంగమే ఎదురైంది. టిమ్ సీఫెర్ట్ (50), రాస్ టైలర్ (53) విజయానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, చివరి ఓవర్లలో కివీస్ చతికిలపడింది. 

తద్వారా భారత్ టీ20లో మూడో క్లీన్ స్వీప్ సాధించింది. తొలిసారి 5 మ్యాచుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 2019లో వెస్టిండీస్ పై జరిగిన సిరీస్ ను 3-0 స్కోరుతో, 2016లో ఆస్ట్రేలియాలపై జరిగిన సిరీస్ ను 3-0 స్కోరుతో క్లీన్ స్వీప్ చేసింది.