Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్: టీ20 వరల్డ్ కప్‌‌ 2022 ముందు టీమిండియాకి భారీ షాక్... గాయంతో జస్ప్రిత్ బుమ్రా అవుట్...

గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జస్ప్రిత్ బుమ్రా దూరం... టీమిండియాపై భారీగా ప్రభావం చూపించనున్న బుమ్రా గైర్హజరీ...

Jasprit Bumrah ruled out of the T20 World Cup 2022
Author
First Published Sep 29, 2022, 3:14 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి సిద్దమవుతున్న భారత జట్టుకి భారీ షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకుని, టీమిండియాతో కలిసిన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా.. గాయం తిరగబెట్టడంతో టీ20 వరల్డ్ కప్ 2022 మొత్తానికి దూరమైనట్టు సమాచారం...

జస్ప్రిత్ బుమ్రా లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీ ఆడిన భారత జట్టు, సూపర్ 4 స్టేజీ నుంచి నిష్కమించింది. బుమ్రా లేకుండా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లోనూ ఓడిన టీమిండియా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన తర్వాత బుమ్రా కమ్‌బ్యాక్ తర్వాతే విజయాన్ని అందుకుంది. ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా, టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి దూరమైతే... భారత జట్టుకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

ఇప్పటికే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ జట్టులోకి వచ్చాడు. బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. అయితే జడేజా బ్యాటుతో చేసే విలువైన పరుగులు చేసే ఆల్‌రౌండర్‌ని జట్టు కోల్పోయినట్టే. అలాగే డెత్ ఓవర్లలో యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్‌ని ముప్పుతిప్పలు పెట్టే బుమ్రా లేకుండా... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా టైటిల్ రేసులో నిలిచే అవకాశాలు చాలా తక్కువంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్‌పర్ట్స్..

వెన్ను నొప్పితో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, దాని నుంచి పూర్తిగా కోలుకోకముందే జట్టు అవసరాల కోసం మళ్లీ టీమ్‌లోకి వచ్చినట్టు వార్తలు వచ్చాయి.

జస్ప్రిత్ బుమ్రా స్థానంలో టీమ్‌లోకి వచ్చిన ఆవేశ్ ఖాన్ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడం, హర్షల్ పటేల్ రిథమ్ అందుకోవడానికి కష్టపడుతుండడంతో స్టార్ పేసర్‌పై ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. జస్ప్రిత్ బుమ్రా వెన్నెముకపై తీవ్రమైన ఒత్తిడి పడడంతో అతనికి కనీసం 4 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట...

దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, వచ్చే ఏడాది జనవరి వరకూ క్రికెట్‌కి దూరంగా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం ఈ వార్తలను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు కీ ప్లేయర్లు దూరమైతే ఆ ప్రభావం భారత జట్టుపై తీవ్రంగా పడుతుంది...

ముఖ్యంగా భారత ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ కుదురుకోవడానికి సమయం తీసుకుంటోంది. మహ్మద్ షమీ కరోనా నుంచి కోలుకున్నా, అతను గత ఏడాది టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. జస్ప్రిత్ బుమ్రా తప్పుకుంటే స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న దీపక్ చాహార్‌ని 15 మంది ప్లేయర్ల జాబితాకు జత చేసి, ఉమేశ్ యాదవ్‌ లేదా మహ్మద్  సిరాజ్‌లకు స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో చోటు ఇచ్చే అవకాశం ఉంది...

 

Follow Us:
Download App:
  • android
  • ios