Asianet News TeluguAsianet News Telugu

Jasprit Bumrah: ప్రపంచకప్‌‌కు దూరమైనా టీమిండియాను బయిటనుంచి ఉత్సాహపరుస్తా : బుమ్రా స్పందన

T20I World Cup 2022: టీమిండియా స్టార్ పేసర్  జస్ప్రీత్ బుమ్రా రాబోయే ప్రపంచకప్ కు దూరమయ్యాడని బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయమై అతడు కూడా  స్పందించాడు. 
 

Jasprit Bumrah Ruled Out From T20I World Cup 2022, Star Pacer Responds
Author
First Published Oct 4, 2022, 3:29 PM IST

అనుకున్నదే అయింది. వెన్నునొప్పి తిరగపెట్టడంతో దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ పేసర్ తాజాగా అక్టోబర్ మూడో వారం నుంచి ప్రారంభం కాబోయే టీ20 ప్రపంచకప్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ఖాతాలో  ప్రకటించింది.  అయితే బీసీసీఐ ఈ విషయాన్ని ట్విటర్ లో వెల్లడించిన తర్వాత బుమ్రా కూడా  స్పందించాడు. తాను ప్రపంచకప్ దూరం కావడంపై  ట్విటర్  లో స్పందిస్తూ.. ఈ మెగా టోర్నీలో ఆడకపోయినా తాను మాత్రం  బయిటనుంచి ఉత్సాహపరుస్తా అని భావోద్వేగ ట్వీట్ చేశాడు. 

బుమ్రా స్పందిస్తూ.. ‘నేను ఈసార టీ20 ప్రపంచకప్ లో భాగం కాలేనని తెలిసినప్పటికీ ధైర్యంగానే ఉన్నా. నేను త్వరగా కోలుకోవాలని నాపై ప్రేమ చూపించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఆస్ట్రేలియా లో టీ20 ప్రపంచకప్  లో నేను భాగం కాకున్నా  భారత  జట్టును బయిటనుంచి ఉత్సాహపరుస్తా..’ అని  ట్వీట్ చేశాడు. 

ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ పర్యటన ముగించుకున్న తర్వాత   బుమ్రా టీమిండియా ఆడిన వెస్టిండీస్, జింబాబ్వే, ఆసియా కప్ లలో ఆడలేదు. రెండు నెలల తర్వాత ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న అతడిని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు బీసీసీఐ ఎంపిక చేసింది.  అదే క్రమంలో బుమ్రాతో ఆస్ట్రేలియా సిరీస్ లో రెండు టీ20లు ఆడించింది. కానీ దక్షిణాఫ్రికా సిరీస్ తొలి మ్యాచ్ లోనే బుమ్రాకు తిరిగి వెన్నునొప్పి మళ్లీ రావడంతో అతడిని ఆ సిరీస్ నుంచి తప్పించి  తదుపరి  వైద్య పరీక్షల కోసం ఎన్సీఏకు పంపింది.  ఎన్సీఏ వైద్య బృందం..బుమ్రా కోలుకోవడానికి ఇంకా సమయం కావాలని చెప్పడంతో బీసీసీఐ సోమవారం రాత్రి.. అతడు ప్రపంచకప్ కు దూరమయ్యాడని అధికారికంగా ప్రకటించింది. 

 

బుమ్రా టీ20 ప్రపంచకప్ కు దూరం కావడంపై  టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా స్పందించాడు. బుమ్రా త్వరగా కోలుకోవాలని, ఎప్పటిలాగే బలంగా తిరిగిరావాలని ఆకాంక్షించాడు. ట్విటర్ ద్వారా హార్ధిక్ స్పందిస్తూ.. ‘మై జస్సీ.. నువ్వు ఎప్పటిలాగే బలంగా తిరిగి రావాలి..’     అని ట్వీట్ చేస్తూ లవ్ సింబల్స్ ను కూడా జతకలిపి పోస్ట్ చేశాడు. 

 

బుమ్రా  టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై బీసీసీఐ త్వరలోనే  ఓ ప్రకటన వెలువరించనుంది. బుమ్రా స్థానాన్ని మహ్మద్ సిరాజ్ గానీ,  మహ్మద్ షమీ లేదంటే దీపక్ చాహర్ లలో ఎవరో ఒకరు భర్తీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios