India vs South Africa: రబాడా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన జస్ప్రిత్ బుమ్రా... సఫారీ గడ్డపై లెజెండరీ బ్యాటర్లు సాధించలేని రికార్డుని సొంతం చేసుకున్న బుమ్రా...

సెంచూరియన్‌లో అద్భుత విజయాన్ని అందుకుని, సఫారీ టూర్‌ను ప్రారంభించిన టీమిండియా... జోహన్‌బర్న్‌లో ఆతిథ్య జట్టును పెద్దగా ఇబ్బందిపెట్టలేకపోతోంది. రెండో టెస్టు తొలి రోజు ఆధిక్యం పూర్తిగా సఫారీ జట్టుదే. భారత జట్టును 202 పరుగులకి ఆలౌట్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు, 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయినా... రెండో వికెట్‌కి కెప్టెన్ డీన్ ఎల్గర్, కేగన్ పీటర్సన్ కలిసి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకున్నారు...

120 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసి జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లను విసిగించిన సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 88 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా...

భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌట్ అయినా విరాట్ కోహ్లీ గైర్హజరీతో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న కెఎల్ రాహుల్ 133 బంతుల్లో 9 ఫోర్లతో 50 పరుగులు చేసి ఆకట్టుకునే పర్పామెన్స్ ఇచ్చాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ 50 బంతుల్లో 6 ఫోర్లతో 46 పరుగులు చేసి.. ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు...

ఇంగ్లాండ్ టూర్‌కి ముందు బ్యాటింగ్ చేయడానికి తెగ ఇబ్బందిపడే జస్ప్రిత్ బుమ్రా, లార్డ్స్ టెస్టు తర్వాత చాలా మారిపోయాడు. మునుపటిలా బ్యాటు పట్టుకోవడానికి ఇబ్బంది పడకుండా, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఓ బ్యాటర్‌లో క్రీజులోకి వచ్చి, కాన్పిడెన్స్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు...

రెండో టెస్టులోనూ బుమ్రా బ్యాటింగ్ మెరుపులు చూసి టీమిండియా, ఫ్యాన్స్‌తో పాటు ఆయన సతీమణి సంజన గణేశన్ కూడా ఆనందంతో మురిసిపోయింది. మూడు వికెట్లు తీసిన సఫారీ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా బౌలింగ్‌లో ఓ సూపర్ సిక్సర్ బాదాడు జస్ప్రిత్ బుమ్రా...

11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రా అజేయంగా నిలిచాడు. భారత జట్టు ఇన్నింగ్స్‌లో వచ్చిన ఒకే ఒక్క సిక్సర్ బుమ్రా బ్యాటు నుంచి వచ్చిందే కావడం విశేషం...

Scroll to load tweet…

ఆసియా బ్యాటర్లకి అత్యంత కఠినంగా ఉండే సౌతాఫ్రికాలో సిక్సర్ బాదిన భారత ప్లేయర్ల జాబితాలో అరుదైన రికార్డు నమోదు చేశాడు జస్ప్రిత్ బుమ్రా... భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీతో పాటు మాజీ కెప్టెన్, ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా సౌతాఫ్రికాలో టెస్టుల్లో సిక్సర్ కొట్టలేకపోయారు.

అలాగే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్, ఆసీస్ మాజీ కెప్టెన్లు స్టీవ్ వా, మైకెల్ క్లార్క్, అలెన్ బోర్డర్, పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్... తమ కెరీర్‌లో సౌతాఫ్రికాలో టెస్టుల్లో సిక్సర్ సాధించలేకపోయారు...

జస్ప్రిత్ బుమ్రా సిక్సర్ సాధించిన సమయంలో స్టాండ్స్‌లో కూర్చొని వీక్షించిన అతని భార్య సంజన గణేశన్, నవ్వు ఆపుకోలేకపోవడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది.