ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ సమయంలో టీమిండియా పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా చేసిన పని నవ్వు తెప్పించింది. ఆసీస్‌ 259 పరుగుల ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్టీవ్‌ స్మిత్‌ 51 పరుగులు, కామెరాన్‌ గ్రీన్‌ 10 పరుగులతో క్రీజులో వున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన స్మిత్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం సాధించే ఊపులో వున్నాడు.

ఇదే సమయంలో భారత ఆల్‌రౌండర్ జడేజా గైర్హాజరీలో వుండటంతో నలుగురు బౌలర్లతో మాత్రమే బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. అయితే జట్టు బౌలింగ్ భారాన్ని మోస్తున్న బుమ్రాపై ఒత్తిడి ఎక్కువైంది. స్పిన్నర్ అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తున్నా వికెట్లు మాత్రం రాలడం లేదు. 

దీంతో బుమ్రా తనలో బయటి ప్రపంచానికి తెలియని ఒక కొత్త కోణాన్ని చూపించాడు. బంతి వేయడానికి బౌలింగ్‌ ఎండ్‌వైపు సాగుతున్న బుమ్రా నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న స్మిత్‌ను చూస్తూ బెయిల్స్‌ను బంతితో కిందకు విసురుకుంటూ వెళ్లిపోయాడు.

దీనిని చూసిన వాళ్లకెవరికైనా ‘‘ స్మిత్‌ ఇక ఆడింది చాలు.. తొందరగా ఔట్‌ అవ్వరా బాబు అన్నట్లుగా బుమ్రా ఆ సంకేతం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే బుమ్రా చర్యతో ఫీల్డ్‌ అంపైర్‌ పాల్‌ రిఫీల్‌ షాక్‌ తిన్నాడు.

బుమ్రా బెయిల్స్‌ పడేయగానే.. అతను ఎందుకిలా చేశాడు అనే కోణంలో రిఫీల్‌ చూస్తూ కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒకరు ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. బుమ్రా చేసిన పనికి అంపైర్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నవ్వు తెప్పిస్తుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక మూడో టెస్టులో టీమిండియా ముందు ఆసీస్ 407 పరుగులు భారీ లక్ష్యం ఉంచిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. పుజారా 9, కెప్టెన్‌ రహానే 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్‌ గెలవాలంటే ఇంకా 309 పరుగులు చేయాల్సి ఉంది.