తల్లిదండ్రులైన టీమిండియా క్రికెటర్ బుమ్రా- సంజన దంపతులు.. పేరు కూడా పెట్టేశారు..
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కుటుంబంలో ఆనందం నెలకొంది. బుమ్రా- సంజన గణేశన్ దంపతులు తల్లిదండ్రులయ్యారు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కుటుంబంలో ఆనందం నెలకొంది. బుమ్రా- సంజన గణేశన్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. బుమ్రా సతీమణి సంజన్ ఈరోజు ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన బుమ్రా.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే తమ కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రాగా పేరు పెట్టినట్టుగా కూడా వెల్లడించారు. ‘‘మా చిన్న కుటుంబం పెరిగింది.. మా హృదయాలు మేము ఊహించిన దానికంటే నిండుగా ఉన్నాయి. ఈ ఉదయం మేము మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. మేము చంద్రునిపై ఉన్నాము. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం, దానితో పాటు తెచ్చే ప్రతిదాని కోసం వేచి ఉండలేము’’ జస్ప్రీత్ బుమ్రా- సంజన పేరుతో సందేశాన్ని పోస్టు చేశారు.
దీంతో పలువురు నెటిజన్లు బుమ్రా-సంజన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆసియా కప్ కొనసాగుతుండగా.. తన భార్య ప్రసవం సమయంలో ఆమె వద్ద ఉండేందుకు బుమ్రా స్వదేశానికి తిరిగివచ్చారు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా.. తన స్వస్థలం ముంబయికి వచ్చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో సోమవారం నేపాల్‌తో జరగనున్న మ్యాచుకు బుమ్రా దూరం కానున్నాడు. అయితే ఆసియా కప్ గ్రూప్-4 ప్రారంభ మ్యాచ్‌ల నాటికి బుమ్రా తిరిగి జట్టులో చేరతాడని సదరు వర్గాలు పేర్కొన్నాయి.