వైస్ కెప్టెన్ తొలగిస్తే, టీమిండియా నుంచి తప్పించడం ఈజీ.. అందుకే కెఎల్ రాహుల్‌ని ఆ పొజిషన్ నుంచి తప్పించారంటున్న హర్భజన్ సింగ్..
కెఎల్ రాహుల్ కారణంగా విరాట్ కోహ్లీ సేఫ్ అయిపోయాడు. కొన్నిరోజుల కిందట వరకూ టెస్టుల్లో సెంచరీ చేయలేకపోతున్న విరాట్ కోహ్లీ గురించి తీవ్రమైన చర్చ జరిగింది. ఇప్పుడు టాపిక్ అంతా కెఎల్ రాహుల్ చుట్టూనే తిరుగుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టుల్లో కలిపి 67 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, టెస్టు వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు...
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్‌గా, కెఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్‌గా కొనసాగిస్తూ వచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్. రోహిత్ శర్మ గాయం కారణంగా టీమ్‌కి అందుబాటులో లేకపోవడంతో మూడు టెస్టులకు సారథ్యం కూడా చేశాడు కెఎల్ రాహుల్...
జోహన్‌బర్గ్ టెస్టులో కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓడిన కెఎల్ రాహుల్, బంగ్లాదేశ్ టూర్‌లో వరుసగా రెండు టెస్టులు గెలిచాడు. కెప్టెన్‌గా రెండు విజయాలు అందుకున్నా, బ్యాటర్‌గా మెప్పించలేకపోయాడు కెఎల్ రాహుల్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరిగిన రెండు టెస్టుల్లోనూ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్‌తో విసిగించిన కెఎల్ రాహుల్, వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు...
చివరి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో కెఎల్ రాహుల్‌కి చోటు దక్కినా, వైస్ కెప్టెన్సీ పదవి మాత్రం ఊడింది. ‘కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ ఊడుతుందని ముందుగానే ఊహించా. ఎందుకంటే వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే, టీమ్ నుంచి తప్పించడం తేలికవుతుంది. వైస్ కెప్టెన్ పొజిషన్‌లో ఉంటే ఎలా ఆడినా చచ్చినట్టు, ప్లేయింగ్ ఎలెవన్‌లో పెట్టాల్సి ఉంటుంది...
కెఎల్ రాహుల్ క్వాలిటీ ప్లేయర్. అందులో ఎవ్వరికీ ఎలాంటి డౌట్ లేదు. అయితే అతను ఇప్పుడు మంచి ఫామ్‌లో లేడు. వైస్ కెప్టెన్ ట్యాగ్ కోల్పోయిన కెఎల్ రాహుల్‌కి కొంత కాలం బ్రేక్ దొరకవచ్చు. అయితే దీన్ని కరెక్టుగా వాడుకుని, కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు వాడుకోవాలి...
నా ఉద్దేశంలో మూడో టెస్టులో శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. మంచి ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ అవసరం ఇప్పుడు టీమిండియాకి చాలా ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...
కెఎల్ రాహుల్‌ని టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించినా చివరి రెండు టెస్టుల్లోనూ ఆడిస్తామని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కామెంట్ చేశాడు. క్లిష్ట సమయంలో ప్లేయర్లకు అండగా ఉండాల్సిన బాధ్యత కెప్టెన్‌పైన, టీమ్ మేనేజ్‌మెంట్‌పైన ఉంటుందని వ్యాఖ్యానించాడు ద్రావిడ్. మూడో టెస్టులో రోహిత్‌తో రాహుల్ ఓపెనింగ్ చేస్తే బీసీసీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
బాగా ఆడకపోయినా సపోర్ట్ చేస్తామని చెబుతున్న బీసీసీఐ, ఇదే ఫార్ములాని సంజూ శాంసన్ విషయలో ఎందుకు వర్కవుట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు... గత ఏడాది టీమిండియా తరుపున 10 వన్డేలు ఆడి, 60కి పైగా సగటుతో ఆకట్టుకున్న సంజూ శాంసన్‌కి, ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌కి ప్రకటించిన జట్టులో చోటు ఇవ్వలేదు సెలక్టర్లు. ఫిట్‌గా ఉన్నా, పరుగులు చేస్తున్నా సంజూ శాంసన్‌ని పక్కనబెట్టేయడానికి కారణాలు చెప్పాలంటూ బీసీసీఐని నిలదీస్తున్నారు...
