టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాక్‌తో మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ ట్వీట్‌కి లక్షల్లో లైకులు... మూడు రోజుల్లో కోహ్లీ ట్వీట్ రికార్డును బ్రేక్ చేసిన ఇస్రో ‘చంద్రయాన్-3’ ట్వీట్.. 

ఏ రికార్డు అయినా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ కావాల్సిందే. దేశం కంటే ఏ ఒక్క వ్యక్తి కూడా గొప్పోడు కాడని నిరూపిస్తూ... చంద్రయాన్-3 ట్వీట్, విరాట్ కోహ్లీ ట్వీట్ రికార్డును బ్రేక్ చేసింది. ఆగస్టు 23న భారత కృత్రిమ ఉపగ్రహం ‘చంద్రయాన్-3’ విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది. సౌత్ పోల్‌లో ఉపగ్రహాన్ని దింపిన మొట్టమొదటి దేశంగా భారత్, సరికొత్త చరిత్ర లిఖించింది. కేవలం రూ.600 కోట్ల వ్యయంతో జరిపిన ఈ ప్రయోగాన్ని యూట్యూబ‌్‌లో 8 లక్షల మందికి పైగా లైవ్ వీక్షించారు.. 

అంతకుముందు 2022 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని 61 లక్షల మంది వీక్షించగా, ఆ రికార్డును ఇస్రో చంద్రయాన్-3 బ్రేక్ చేసేసింది. యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన లైవ్ స్ట్రీమింగ్ వీడియోగా నిలిచింది..

చంద్రుడి ఉపరితలంపై ‘చంద్రయాన్-3’ సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇస్రో, ‘చంద్రయాన్-3 మిషన్: ‘ఇండియా, నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను. మీరు కూడా!’: చంద్రయాన్-3 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. కంగ్రాట్స్ ఇండియా...’ అంటూ ట్వీట్ చేసింది..

ఇస్రో చేసిన ఈ ట్వీట్‌కి అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 839.9 వేల లైక్స్ వచ్చాయి. ఇండియాలో అత్యధిక లైక్స్ వచ్చిన ట్వీట్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇస్రో ‘చంద్రయాన్-3’ ట్వీట్..

Scroll to load tweet…

ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా గెలిపించాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్.. ఇలా 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాని.... వీరోచిత పోరాటంతో గెలుపు బాట పట్టించాడు.

53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, కెరీర్ బెస్ట్ టీ20 ఇన్నింగ్స్‌తో టీమిండియాకి సంచలన విజయం అందించాడు. ఈ మ్యాచ్ తర్వాత ‘స్పెషల్ విన్. వేల సంఖ్యలో విచ్చేసిన అభిమానులకు థ్యాంక్యూ’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ ట్వీట్‌కి 796 వేల లైక్స్ వచ్చాయి. ఇండియాలో అత్యధిక లైక్స్ రాబట్టిన ట్వీట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ ట్వీట్‌ని ఇస్రో అధిగమించింది...

Scroll to load tweet…

విరాట్ కోహ్లీ మోస్ట్ లైక్డ్ ట్వీట్ రికార్డు బ్రేక్ కాకూడదని, ఇస్రో ట్వీట్‌ని ఫ్యాన్స్ ఎవ్వరూ లైక్ చేయవద్దని కొందరు కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఇస్రో ప్రయోగానికి సోషల్ మీడియా ప్రపంచం దాసోహం అనడంతో విరాట్ కోహ్లీ రికార్డు 3 రోజుల్లోనే బ్రేక్ అయిపోయింది..