సెంచరీలు చేస్తున్న గిల్ చెంపలు వాయించిన ఇషాన్.. పక్కనే ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చహాల్
టీమిండియా యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ - ఇషాన్ కిషన్ లు మంచి మిత్రులు. ఈ ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉంటారని, ఇద్దరి మధ్య సోదరభావం ఉందని గతంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా చెప్పాడు.

భారత క్రికెట్ జట్టు యువ కెరటాలు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ లు వాదులాడుకున్నారు. తనతో పాటే ఉంటూ ఒకవైపు తానేమో విఫలమవుతుంటే మరోవైపు గిల్ మాత్రం సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. సహచర ఆటగాడు అని కూడా చూడకుండా ఇషాన్.. గిల్ చెంపలు వాయించాడు. అతడిమీద ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇదంతా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహాల్ ఎదుటే జరిగింది. ఇంత జరుగుతున్నా చాహల్ మాత్రం మౌనాన్ని వీడలేదు. తనకేమీ సంబంధం లేదన్నట్టుగా మిన్నుకుండిపోయాడు.
ఇదంతా నిజం ఫైట్ అనుకుంటున్నారా..? లేదు లేదు. అంతా ఉత్తుత్తి ఫైటే. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముగ్గురూ కలిసి ఎంటీవీ లో ప్రసారమయ్యే ప్రముఖ యూత్ షో.. ‘రోడీస్ ఆడిషన్ సీన్’ను రీక్రియేట్ చేశారు. ఇందులో భాగంగానే ఫన్నీ వీడియో ను అభిమానులతో పంచుకున్నారు.
రోడీస్ ఆడిషన్ షో లో.. ఇద్దరు జడ్జీలు తమ దగ్గరికి వచ్చిన కంటెస్టెంట్ ల మీద విరుచుకుపడటం వంటివి చేస్తుంటారు. తాజా వీడియోలో ఆ ఇద్దరు జడ్జీల పాత్రలను చహాల్, ఇషాన్ లు పోషించారు. వీడియోలో చహాల్.. ‘నువ్వు యాక్టింగ్ కు పనికిరావు’అన్నట్టుగా పేపర్ తీసి కింద పడేస్తాడు. అప్పుడే ఇషాన్.. ‘ఇంటెన్సిటీ, ప్యాషన్..’ అని ఆగ్రహం చూపిస్తాడు.
అప్పుడు గిల్.. ‘నాకు ఆ ఇంటెన్సిటీ ఉంది. నాలో ఆ ప్యాషన్ ఉంది. నేను చేయగలను’అని బాధపడుతూ చెప్పగా ఇషాన్ గొరిల్లా మాదిరి లాంగ్ జంప్ చేసి గిల్ మీదుగా దూకి అతడిని పక్కకు నెట్టేస్తాడు. ఆ తర్వాత గిల్ ను చెంపలు వాయించుకోమని ఆదేశిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గిల్ తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నది.
టీమిండియా , ఐపీఎల్ తరఫున ఆడే క్రికెటర్లు కృనాల్ పాండ్యా, శివమ్ మావి, నాగర్‌కోటి, రాహుల్ తెవాటియా లతో పాటు హార్ధిక్ పాండ్యా భార్య నటాషా స్టాన్కోవిచ్ కూడా కామెంట్స్ చేయడం గమనార్హం.