ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ... వెంటవెంటనే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా! వర్షంతో ఆగిన ఆట...
హాఫ్ సెంచరీ చేసి అవుటైన ఇషాన్ కిషన్... మరో సారి శుబ్‌మన్ గిల్ ఫ్లాప్ షో... వర్షం కారణంగా నిలిచిన ఆట...

వెస్టిండీస్ టూర్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో చేస్తున్న ప్రయోగాలు, టీమిండియాకి అస్సలు కలిసి రావడం లేదు. తొలి వన్డేలో 115 పరుగుల లక్ష్యఛేదనలో 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, రెండో వన్డేలోనూ శుభారంభం దక్కిన తర్వాత వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయింది..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకి ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ కలిసి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత శుబ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది భారత జట్టు. 49 బంతుల్లో 5 ఫోర్లతో 34 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మోటీ బౌలింగ్‌లో అల్జెరీ జోసఫ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి వరుసగా ఎనిమిదో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు శుబ్‌మన్ గిల్. గిల్ అవుటైన తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది టీమిండియా..
55 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో అతనజేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసి, మ్యాచ్‌ని ముగించలేకపోయిన ఇషాన్ కిషన్..రెండో వన్డేలో శుభారంభం దక్కినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు..
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అక్షర్ పటేల్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో షై హోప్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 97 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. 14 బంతుల్లో 7 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, జేడన్ సీల్స్ బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. 113 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా..
చాలా రోజుల తర్వాత తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్, రాక రాక వచ్చిన అవకాశాన్ని పెద్దగా వాడుకోలేకపోయాడు. 19 బంతుల్లో 9 పరుగులు చేసిన సంజూ శాంసన్, కరియా బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సంజూ శాంసన్ అవుట్ కాగానే వర్షం కురవడంతో మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 24.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది భారత జట్టు..