Asianet News TeluguAsianet News Telugu

ధావన్ కథ ముగిసినట్టేనా..? వన్డే వరల్డ్ కప్ ఆశలు ఆవిరి.. పోతూ పోతూ గబ్బర్‌కు షాకిచ్చిన సెలక్షన్ కమిటీ

BCCI: స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే టీ20, వన్డే సిరీస్ లకు చేతన్ శర్మ సారథ్యంలోని  సెలక్షన్ కమిటీ  మంగళవారం రాత్రి ప్రకటించింది.  అయితే  వన్డే సిరీస్ లో  వెటరన్ ఆటగాడు శిఖర్ ధావన్ పై వేటు పడింది. 

Is This Ending Of Shikhar Dhawan Career? Outgoing Selectors Drop Big Bomb on Team India Opener
Author
First Published Dec 28, 2022, 11:26 AM IST

టీ20 ప్రపంచకప్ లో భారత్ ఓటమి తర్వాత వేటుకు గురైన చేతన్ శర్మ  సారథ్యంలోని  జాతీయ సెలక్షన్ కమిటీ  మంగళవారం రాత్రి  స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే మూడు టీ20లు, మూడు వన్డేలకు  జట్టును ఎంపిక చేసింది.   ఇప్పటికే వేటు పడ్డ  సెలక్టర్లకు కొత్త  సెలక్షన్ కమిటీ వచ్చే వరకూ  ఇంకా సమయముండటంతో  ఈ జట్లను ఎంపిక చేసే బాధ్యతలు అప్పజెప్పింది బీసీసీఐ. అయితే  పోతూ పోతూ  సెలక్టర్లు  టీమిండియా వెటరన్ ఆటగాడు శిఖర్ ధావన్ నెత్తిన పిడుగేశారు.   సొంతగడ్డపై  లంకతో సిరీస్ కు అతడిని ఎంపిక చేయలేదు. దీంతో ధావన్ కెరీర్ దాదాపుగా ముగిసినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయి కేవలం వన్డేలకు పరిమితమైన  ధావన్..   వచ్చే ఏడాది భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ ఆడి కెరీర్ ను ముగిద్దామని భావిస్తున్నాడు. అయితే  సెలక్టర్లు మాత్రం ధావన్ కు అంతకంటే ముందే షాకిచ్చారు. ఈ చర్య ద్వారా ధావన్ టీమిండియా భవిష్యత్ ప్రణాళికల్లో లేడని  స్పష్టం చేశారు సెలక్టర్లు. 

రోహిత్ గైర్హాజరీలో వన్డే జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న ధావన్ గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో విఫలైమన  ధావన్.. ఇటీవల బంగ్లాదేశ్ తో మూడు వన్డేలలో (18 పరుగులు)  కూడా తేలిపోయాడు. దీంతో  ధావన్ పై వేటు పడిందని వాదనలు వినిపిస్తున్నా..  వచ్చే వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకునే కొత్త జట్టును ఎంపిక చేసినట్టు  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

ఇషాన్ ఇరగదియ్యడంతో.. 

అయితే ధావన్  పై వేటు పడటానికి మరో కారణం టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇరగదియ్యడం.  గత కొద్దికాలంగా టీ20 జట్టులో అడపాడదపా అవకాశాలొచ్చినా ఇరగదీస్తున్న ఈ జార్ఖండ్ కుర్రాడు.. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో భాగంగా మూడో వన్డేలో డబుల్ సెంచరీ బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో అతడిని  జట్టు నుంచి తప్పించలేని పరిస్థితిని సృష్టించాడు.   ధావన్ ను  పక్కనబెట్టి  రోహిత్ శర్మతో కలిసి  ఇషాన్ ను ఓపెనర్ గా పంపే ప్రణాళికల్లో భాగంగానే అతడికి లంకతో వన్డే, టీ20లలో అవకాశమిచ్చారని  గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే ధావన్ కెరీర్ దాదాపు ముగిసినట్టేనని  అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 

 

లంకతో వన్డేలకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ,  సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ 

Follow Us:
Download App:
  • android
  • ios