Harbhajan Singh: వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్.. కాంగ్రెస్ పార్టీలో చేరునున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పంజాబ్ లో రాజకీయ ముఖచిత్రం మారుతున్నది. అక్కడ మరో దఫా గెలిచి పీఠం పదిలం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. ఇటీవలే ఆ పార్టీతో పాటు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ స్థాపించిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ తో కలిసి నడిచేందుకు బీజేపీ పావులు కదుపుతున్నది. కాగా, గత ఎన్నికలలో అమరీందర్ సింగ్.. భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అమరీందర్ పార్టీ నుంచి వెళ్లినా.. సిద్ధూ మాత్రం కాంగ్రెస్ ను వీడలేదు. తాజాగా అతడు పార్టీకి ఆకర్షణ పెంచడానికి సెలబ్రిటీలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను కూడా ఆ పార్టీలోకి ఆహ్వానించాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు తాజాగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన ఓ ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తున్నది. హర్భజన్ సింగ్ తో ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇలా జరిగే అవకాశం ఉంది...’ అని రాసుకొచ్చాడు. దీనితో పంజాబ్ రాజకీయాల్లో మరో క్రికెటర్ ఎంట్రీ ఖాయమని అక్కడ చర్చలు నడుస్తున్నాయి.
వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల సమయంలోనే పార్టీలో చేరి టికెట్ ఆశించేకంటే.. ముందే చేరితో బెటరని భజ్జీతో సిద్ధూ చర్చించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఇద్దరూ చర్చించుకున్నారని సమాచారం. అయితే దీనిపై భజ్జీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదిలాఉండగా.. భజ్జీ బీజేపీలో చేరుతున్నారని ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. హర్భజన్ తో పాటు టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా బీజేపీ కండువా కప్పుకోనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిని భజ్జీ కొట్టి పారేశాడు. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని తేల్చాడు. తాను బీజేపీలో చేరడం లేదని అన్నాడు.
బీజేపీతో చేరబోనని భజ్జీ ప్రకటించిన నాలుగు రోజుల్లోనే అతడు సిద్ధూను కలవడం.. ట్విట్టర్ లో సిద్ధూ ఫోటో క్యాప్షన్.. ఇవన్నీ చూస్తే భజ్జీ రాజకీయ ఆగమనం జరిగే అవకాశముందని అతడి ఫ్యాన్స్ తో పాటు పంజాబ్ లో జనాలు భావిస్తున్నారు. మారి తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో స్పిన్ తో ఎన్నో కీలక మ్యాచులు మలుపుతిప్పిన భజ్జీ.. పంజాబ్ రాజకీయాలను ఏ విధంగా తనవైపునకు తిప్పుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
