టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్... ధోనీ వారసుడిగా జట్టులోకి అడుగుపెట్టాడు. అయితే... ధోనీ స్థాయిలో ఆట మాత్రం పంత్ కనపరచలేకపోయాడు. దీంతో... విపరీతమైన ట్రోల్స్ బారిన పడ్డాడు. పంత్ ప్రపంచకప్ తర్వాత ఆడిన అన్ని ఆటల్లోనూ చెత్త ప్రదర్శన కనపరిచి.. విమర్శలపాలయ్యాడు.

ఈ సంగతి పక్కనపెడితే.. ప్రస్తుతం పంత్ గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. పంత్ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాతో డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన  మూడో టీ20కి ముందు రోజు పంత్... ఊర్వశితో కలిసి డిన్నర్ కి వెళ్లారు. వీరిద్దరూ ఓ ఖరీదైన హోటల్ లో డిన్నర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు మీడియా కంట పడటంతో.. వీరి ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు మొదలయ్యాయి.

అయితే.... ఈ విషయం బయటకు పొక్కగానే.. నెటిజన్లు పంత్ పై విమర్శలు  చేయడం మొదలుపెట్టారు. ఊర్వశితో డిన్నర్ అనంతరం ఆడిన చివరి టీ20 మ్యాచ్‌లో పంత్ డకౌటయ్యాడు. దీంతో నెటిజన్లు పంత్‌ని ఓ ఆటాడుకుంటున్నారు. ఊర్వశితో డిన్నర్‌ మధురానుభూతుల నుంచి బయటపడకపోవడమే మనోడి వైఫల్యానికి కారణం అని నెటిజన్లు పంత్‌ను విమర్శిస్తున్నారు. 

ప్రస్తుతం పేలవ ఫామ్‌తో కష్టాల్లో ఉన్న పంత్‌కు ఊర్వశి 'జోయా ఫ్యాక్టర్‌' అవుతుందేమో చూడాలని మరికొందరు అంటున్నారు. ఇషా నేగి అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నానని పంత్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో... మరి ఇషా నేగి ఏమైంది..? ఆమెతో ప్రేమకు పులిస్టాప్ పెట్టేసినట్లేనా అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై పంత్ ఇంత వరకు స్పందించలేదు. ఈ విషయం పక్కన పెడితే... ఇదే బాలీవుడ్ నటి ఊర్వశి గతంలో హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. అయితే... ఆ వార్తలను ఆమె అప్పడే ఖండించడం గమనార్హం.