Ashwin: సుమారు పదేండ్లకు పైగా టీమ్ లో ఉన్నా  అశ్విన్ ఎప్పుడూ  టీమ్ కెప్టెన్  రేసులో లేడు.  కోహ్లీ తర్వాత  టీమిండియా టెస్టు  కెప్టెన్సీ పగ్గాలు అతడికి అందజేయాలని చూసినా... 

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను భారత జట్టు ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆడించలేదు. బెంచ్ కే పరిమితమైన అశ్విన్.. భారత్ కు తిరిగొచ్చాక నేరుగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు. అయితే ఇండియాకు వచ్చాక అశ్విన్.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అశ్విన్ ను టీమిండియా సారథ్య పదవి వరించకపోవడానికి కూడా కారణం ఆ ‘అతి తెలివి’యేనని వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ ఇంటర్వ్యూలో అశ్విన్ తనకు టీమిండియాలో ఛాన్స్ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. మేం ఆడబోయేది డబ్ల్యూటీసీ ఫైనల్. నేను కూడా అక్కడ ఆడాలనుకున్నా. టీమ్ ఇక్కడిదాకా రావడానికి నేను నా వంతు కృషి చేశా.లాస్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా నేను నాలుగు వికెట్లు తీశా... 

ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించేదశలో నేను లేను. నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. ఏదైనా పనిని నేను అనుకున్నవిధంగా చేయకుంటే నన్ను విమర్శించుకునే మొదటి వ్యక్తిని నేనే అవుతా. నాకు నేనే కెప్టెన్, నేనే హెడ్ కోచ్. నా విమర్శకుడిని కూడా నేనే. నేనెప్పుడు నాకొచ్చిన పురస్కారాలను చూసి ఘనతలను చూసి పొంగిపోయేవాడిని కాదు. నన్నెవరు జడ్జ్ చేస్తున్నారో ఆలోచించడం కూడా నాకు ముఖ్యం కాదు..’ అని చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.

టీమ్ లో చోటు దక్కకపోయినా అశ్విన్ మాట్లాడే విధానంలో మార్పు రాలేదని వాపోతున్నారు. ఇదే అతడిని కెప్టెన్సీ నుంచి దూరం చేసిందన్న వాదనలూ ఉన్నాయి. సుమారు పదేండ్లకు పైగా టీమ్ లో ఉన్నా అశ్విన్ ఎప్పుడూ టీమ్ కెప్టెన్ రేసులో లేడు. కోహ్లీ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అశ్విన్ కు అప్పజెప్పాలన్న వాదనలు వినిపించినా బీసీసీఐ మాత్రం వాటిని రోహిత్ శర్మకే అప్పజెప్పింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత వెస్టిండీస్ ముగిశాక టెస్టు బాధ్యతల నుంచి రోహిత్ ను తప్పించాలన్న చర్చ జరుగుతున్నా దానికి జడేజా పేరు చర్చలోకి వస్తుందే గానీ అశ్విన్ పేరు మాత్రం చర్చలో లేదు.

Scroll to load tweet…

అశ్విన్ కు క్రికెట్ నాలెడ్జ్ ఎక్కువ. అతడు తన యూట్యూబ్ ఛానెల్ లో ఇందుకు సంబంధించి చర్చలు కూడా చేస్తుంటాడు. సున్నితమైన అంశాలపై కూడా అనర్గళంగా మాట్లాడగలడు. అయితే ఇది వరం కావాల్సింది పోయి అశ్విన్ కు శాపంగా మారిందన్న విమర్శలు కూడా ఉన్నాయి.