భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పుట్టిన రోజు నేడు. కాగా.. ఆయన నేటితో 40వ పడిలోకి అడుగుపెట్టాడు. 1998లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన హర్భజన్.. టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా 2001లో అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికీ ఐపీఎల్ తన జోరు చూపిస్తున్న ఈ వెటర్నర్ క్రికెటర్ కి సోషల్ మీడియాలో  పుట్టిన రోజు శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.

అభిమానులతోపాటు.. తోటి క్రికెటర్లు కూడా భజ్జీకి తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా.. ముందుగా మహ్మద్ కైఫ్ విషెస్ తెలియజేయగా,.. యువరాజ్ సింగ్ చెప్పిన బర్త్ డే విషెస్ మాత్రం అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

‘‘ఇది నీ 40వ పుట్టిన రోజో, 47వ పుట్టిన రోజో. కానీ.. నీతో గడిపిన సరదా రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.  చాలా సార్లు మనం ఒకరి కాళ్లు మరొకరు పట్టుకొని లాగిన రోజులు ఉన్నాయి. ఒక్కోసారి ప్యాంట్లు కూడా పట్టుకొని లాగిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఉత్తమమైన సింగ్ నువ్వు. ఈ రోజు నీకు ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను పాజీ’’ అంటూ యూవీ ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్ నెట్టింట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

 

ఈ పోస్టుకి ఓ వీడియో కూడా పోస్టు చేశారు. దానికి సింగ్ ఈజ్ కింగ్ అనే టైటిల్ పెట్టి... తామిద్దరూ కలిసి దిగిన ఫోటోలతో ఆ వీడియో తయారు చేసి. షేర్ చేశారు. ఆ వీడియో కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.