చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస ఎదురు దెబ్బలతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే రైనా దూరమవడం, రుతురాజ్, దీపక్ చాహర్ లిద్దరు కరోనా బారినపడ్డారు. సపోర్టింగ్ స్టాఫ్ లో కూడా మరో 10 మంది వరకు ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే చెన్నై పీకల్లోతు కష్టాల్లో ఉంది. 

ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగులబో తుందా? పరిస్థితులు చూస్తుంటే తప్పదేమో అనిపిస్తోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పటికే అత్యంత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌  రైనా సేవలు కోల్పోయింది. సీనియర్‌ స్పిన్నర్‌, టర్బోనేటర్‌ హర్భజన్‌ సింగ్‌ సైతం ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వ్యక్తిగత కారణాలతో చెన్నైలో జరిగిన క్రికెటర్ల క్యాంప్‌కు హర్భజన్‌ సింగ్‌ హాజరు కాలేదు. సెప్టెంబర్‌ 1న దుబాయికి చేరుకోవాల్సి ఉంది. సూపర్‌ కింగ్స్‌ శిబిరంలో 13 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో భజ్జీ పునరాలోచనలో పడినట్టు సన్నిహిత వర్గాల సమాచారం. ఆలస్యంగా వెళ్లాలా? అసలు వెళ్లటమే మానేయాలా? అని హర్భజన్‌ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

సురేష్ రైనా వెళ్లిపోవడం టీం కి చాలా పెద్ద ఎదురు దెబ్బ. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విషయంలో రైనా టీం కి కొండంత అండ. టీం కష్టాల్లో ఉన్నప్రతిసారి.... ఈ సీనియర్ ప్లేయర్ తనదైన సహకారాన్ని అందించాడు. చెన్నై ఐపీఎల్ కప్పులు కొట్టడంలో రైనా పాత్ర కీలకం. 

ఇక చాహర్ విషయానికి వస్తే చెన్నై టీం లో కీ బౌలర్. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ధోనికి గో టు ప్లేయర్. పవర్ ప్లే నుంచి మొదలుకొని డెత్ బౌలింగ్ వరకు అన్నింటా చాహర్ చాలా సమర్థవంతంగా బౌలింగ్ చేయగలడు. 

ఇక రుతురాజ్ గైక్వాడ్ విషయానికి వస్తే.... సమర్థవంమతమైన టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్. ఈ 23 ఏండ్ల చిచ్చరపిడుగు డొమెస్టిక్ సర్క్యూట్ లో దుమ్ము రేగ్గొట్టాడు. ఇండియా ఏ, ఇండియా బి టీం తరుఫున కూడా మంచి ప్రదర్శన చేసాడు.

సురేష్ రైనా వెళ్లిపోవడం, దీపక్ చాహర్ కి కోలుకున్న తరువాత సరైన ప్రాక్టీస్ లభించని కారణంగా అతడు ఎంత సమర్థవంతంగా బౌలింగ్ చేస్తాడనేది వేచి చూడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో హర్భజన్ కూడా దూరమైతే టీం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారవ్వచ్చు.