Cobra Trailer: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ త్వరలోనే వెండితెర మీద మెరవనున్నాడు. ప్రముఖ తమిళ నటుడు చియాన్ విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలో పఠాన్ కీలక పాత్రదారి.
తమిళ విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కోబ్రా’. తమిళం, తెలుగు, మళయాళం, కన్నడతో పాటు హిందీలోనూ విడుదల కాబోతున్న ఈ హై ఓల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తున్నది. విభిన్న పాత్రలలో విక్రమ్ నటన దుమ్మురేపుతుండగా.. అతడికి తీసిపోకుండా ఇర్ఫాన్ పఠాన్ కూడా బాగా నటించాడని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ట్రైలర్ విడుదలయ్యాక దీనిపై పలువురు తాజా, మాజీ క్రికెటర్లు, పఠాన్ సహచర ఆటగాళ్లు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమిండియా ఆల్ రౌండర్ దీపక్ హుడా, వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప, మాజీ క్రికెటర్ సురేశ్ రైనాలు ఇర్ఫాన్ ను ప్రశంసల్తో ముంచెత్తుతున్నారు.
ట్రైలర్ లో పఠాన్ కనిపించింది కొంతసేపే అయినా సినిమాలో అతడిది కీలక పాత్ర అని అర్థమవుతూనే ఉన్నది. ఈ ట్రైలర్ ను ట్విటర్ లో పంచుకుంటూ దీపక్ హుడా.. ‘ఈ ట్రైలర్ నన్ను ఓ పదేండ్ల వెనక్కి తీసుకెళ్లింది. ఒకసారి ఇర్ఫాన్ భాయ్ నాతో.. నేను ఏమైనా చేయగలను. నేను ఆల్ రౌండర్ ను అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి. ఈ సినిమాతో నీ మాటను నువ్వు నిలబెట్టుకున్నావ్. వెండితెరపై నిన్ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్ చేశాడు.
రాబిన్ ఊతప్ప స్పందిస్తూ.. ‘నీ ప్రయాణంలో మరో అవతారం ఎత్తుతున్నందుకు శుభాకాంక్షలు సోదరా.. చాలా సంతోషంగా ఉంది. కోబ్రాను చూసేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నా..’ అని ట్వీట్ చేశాడు.
ఇదే విషయమై సురేశ్ రైనా ట్వీట్ లో.. ‘కోబ్రాలో నీ నటనను చూడటం ఆనందంగా ఉంది. చూస్తుంటే ఇది పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ అని అనిపిస్తున్నది. నీకు, కోబ్రా సినిమా టీమ్ కు మంచి విజయం దక్కాలని ఆశిస్తున్నా..’ అని పేర్కొన్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
