Asianet News TeluguAsianet News Telugu

స్కాట్లాండ్‌కు షాక్ ఇచ్చిన ఐర్లాండ్.. ఉత్కంఠలో సూపర్-12 రేసు

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భాగంగా సూపర్-12కు అర్హత సాధించాలంటే  క్వాలిఫై రౌండ్ లో రెండు మ్యాచ్ లు గెలిచినా చాలు. కాగా గ్రూప్-బిలో ఉన్న స్కాట్లాండ్ తమ తొలి మ్యాచ్ లో విండీస్ ను ఓడించగా.. రెండో మ్యాచ్ లో ఐర్లాండ్  చేతిలో ఓడింది. 

Ireland Beat Scotland, Super - 12 Race Turns Interesting in group - B
Author
First Published Oct 19, 2022, 1:11 PM IST

క్వాలిఫై రౌండ్ ఆడుతున్న స్కాట్లాండ్.. సూపర్-12 రేసులో తొలి మ్యాచ్ గెలిచినా తదుపరి మ్యాచ్ లో మాత్రం తడబడింది. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సూపర్-12కు అర్హత సాధించే ఛాన్స్ ను మిస్ చేసుకుంది. తమ తొలి మ్యాచ్ లో పటిష్ట వెస్టిండీస్ ను మట్టికరిపించిన  స్కాట్లాండ్..  ఇప్పుడు ఐర్లాండ్ చేతిలో ఓడింది. హోబర్ట్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.  భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఐర్లాండ్ తొలుత నెమ్మదిగా ఆడినా చివర్లో రెచ్చిపోయింది. లక్ష్యాన్ని  ఆ జట్టు  19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి (180) ఛేదించింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్ కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది.  ఆ జట్టు ఓపెనర్ మున్సే (1) విఫలమయ్యాడు. కానీ మరో ఓపెనర్ మైఖేల్ జోన్స్ (55 బంతుల్లో 86, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారం చేశాడు.  

జోన్స్  కు ఆ జట్టు వికెట్ కీపర్ క్రాస్ (21 బంతుల్లో 28, 5 ఫోర్లు), కెప్టెన్ బెర్రింగ్టన్ (27 బంతుల్లో 37, 3 ఫోర్లు, 1 సిక్సర్) తోడుగా నిలిచారు.  ఐర్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్న  జోన్స్..  సెంచరీకి పదిహేను పరుగుల దూరంలో  జోషువా లిటిల్ వేసిన  18.5 ఓవర్లో  మార్క్ అడైర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  చివర్లో లీస్క్ (13 బంతుల్లో 17 నాటౌట్, 2 ఫోర్లు)  రాణించాడు.   

లక్ష్య ఛేదనలో  ఐర్లాండ్ ఓపెనర్లు విఫలమయ్యారు.  పాల్ స్టిర్లింగ్  (8), ఆండ్రూ బల్బిర్నీ (14) తక్కువ స్కోరుకే పెవిలియన్ కు చేరారు. వన్ డౌన్ లో వచ్చిన లొర్కన్ టక్కర్ (20), హ్యరీ టెక్టర్ (14) కూడా అదే బాటలో పయనించారు.   దీంతో ఐర్లాండ్.. 9.3 ఓవర్లలోనే 61 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.  

ఛేదించాల్సిన రన్ రేట్ పెరిగిపోతుండటంతో   కర్టిస్ కాంఫర్ (32 బంతుల్లో 72 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), జార్జ్ డాక్రెల్ (27 బంతుల్లో 39 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) లు హిట్టింగ్ కు దిగారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీ, సిక్సర్లు కొడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపంచారు. చివరి నాలుగు ఓవర్లలో 35 పరుగులు అవసరం కాగా 17వ ఓవర్లో మార్క్ వాట్ 11 పరుగులిచ్చాడు. 18వ ఓవర్లో షరీఫ్ 12 పరుగులిచ్చాడు. చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్లోనే  ఐర్లాండ్ ఇన్నింగ్స్ ను ముగించింది.

 

ఈ మ్యాచ్ ఫలితంతో గ్రూప్ - బి లో పోటీ ఆసక్తికరంగా మారింది. జింబాబ్వే ఒక మ్యాచ్  ఆడి ఒకదాంట్లో గెలిచింది. స్కాట్లాండ్, ఐర్లాండ్ రెండేసి మ్యాచ్ లు ఆడి చెరో మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ లో ఓడాయి.  వెస్టిండీస్ ఒక మ్యాచ్ ఆడి  ఒకదాంట్లో ఓడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios