Asianet News TeluguAsianet News Telugu

సర్ఫరాజ్ ఖాన్ ఖాతాలో మరో సెంచరీ... సౌరాష్ట్ర జట్టుకి చుక్కలు చూపించిన ముఖేశ్, ఉమ్రాన్ మాలిక్...

ఇరానీ కప్ 2022 టోర్నీలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరుపున సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ ఖాన్...  తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్...

Irani Cup 2022: Sarfaraz Khan scores another Century, Umran Malik Impressive spell
Author
First Published Oct 1, 2022, 5:38 PM IST

సర్ఫరాజ్ ఖాన్... దేశవాళీ టోర్నీల్లో ఓ సంచలనం. అలాంటి ఇలాంటి సంచలనం కాదు, సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ కొట్టినంత ఈజీగా రెడ్ బాల్ క్రికెట్‌లో సెంచరీల మోత మోగిస్తూ దూసుకుపోతున్నాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీ ట్రోఫీలో చెలరేగిన సర్ఫరాజ్ ఖాన్, ఇప్పుడు ఇరానీ కప్‌లోనూ అదే ఫామ్‌ని కొనసాగించాడు...
ఇరానీ కప్ 2022 టోర్నీలో భాగంగా రంజీ ట్రోఫీ విన్నర్ సౌరాష్ట్రతో కలిసి రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్ పోటీపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హర్విక్ దేశాయ్, చిరాగ్ జానీ డకౌట్ కాగా స్నెల్ పటేల్ 4 పరుగులు, ఛతేశ్వర్ పూజారా 1, షెల్డన్ జాక్సన్ 2, ప్రెరక్ మన్కండ్ 9, పార్త్ భట్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు...

అర్పిత్ వసవాడ 19 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు, జయ్‌దేవ్ ఉనద్కట్ 12 పరుగులు, ధర్మేంద్రసిన్హా జడేజా 28 పరుగులు చేయగా ఛేతన్ సకారియా 23 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముఖేశ్ కుమార్ 10 ఓవర్లలో 4 మెయిడిన్లతో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయగా కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ మూడేసి వికెట్లు తీశారు... రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్ల విజృంభణతో 24.5 ఓవర్లలో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ ముగిసింది...

ఇరానీ కప్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 1995లో ముంబైపై రెస్ట్ ఆఫ్ ఇండియా సాధించిన 99 పరుగుల రికార్డును తుడిచేసింది సౌరాష్ట్ర. 

అయితే సౌరాష్ట్రను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామనే ఆనందం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకి ఎక్కువ సేపు నిలవలేదు. ఖాతా తెరవకుండానే అభిమన్యు ఈశ్వరన్ వికెట్ కోల్పోయింది రెస్ట్ ఆఫ్ ఇండియా. ఈశ్వరన్‌ని జయదేవ్‌ ఉనద్కట్ డకౌట్ చేయగా మయాంక్ అగర్వాల్ 11 పరుగులు చేసి ఛేతన్ సకారియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 5 పరుగులు చేసిన యంగ్ ప్లేయర్ యష్ ధుల్‌ కూడా ఉనద్కట్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది రెస్ట్ ఆఫ్ ఇండియా...

అయితే ఈ దశలో రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ హనుమ విహారితో జత కలిసిన సర్ఫరాజ్ ఖాన్, నాలుగో వికెట్‌కి అజేయంగా 187 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. హనుమ విహారి తన స్టైల్‌లో 145 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 పరుగులు చేయగా సర్ఫరాజ్ ఖాన్ 126 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు...

గత 24 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో సర్ఫరాజ్ ఖాన్ 125 సగటుతో 2200+ పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా 43 ఇన్నింగ్స్‌ల్లో 82.63 సగటుతో 2892 పరుగులు చేశాడు సర్ఫరాజ్ ఖాన్. 

Follow Us:
Download App:
  • android
  • ios