ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలిసారి ఛేదనలో ఓడిన టీమ్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్... రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ... 

ఐపీఎల్ 2021 సీజన్‌లో పూర్ పర్ఫామెన్స్‌ని 2022 సీజన్ ఆరంభమ్యాచ్‌లోనూ కొనసాగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులకే పరిమితమైంది. 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది ఆరెంజ్ ఆర్మీ. 


కెప్టెన్ కేన్ విలియంసన్ 7 బంతులాడి 2 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ కాగా, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ డకౌట్ అయ్యారు... నికోలస్ పూరన్‌కి గత రెండు సీజన్లలో ఇది ఐదో డకౌట్ కావడం విశేషం. 

ఫలితంగా 9 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 14 పరుగులు మాత్రమే చేసిన సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత లోయెస్ట్ పవర్ ప్లే స్కోరు నమోదు చేసింది...

పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా సన్‌రైజర్స్ స్కోరు కార్డు ముందుకు సాగలేదు. అభిషేక్ శర్మ 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి అవుట్ కాగా అబ్దుల్ సమద్ 6 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

10.2 ఓవర్లు ముగిసే సమయానికి 37 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. రొమారియో సిఫర్డ్ 18 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి చాహాల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 

వాషింగ్టన్ సుందర్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. నాథన్ కౌంటర్ నైల్ వేసిన 17వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు రాబట్టాడు. 14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయిడిన్ మార్క్‌రమ్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు వరుసగా నో బాల్స్ సమర్పించారు. భువీ వేసిన మొదటి ఓవర్‌లో జోస్ బట్లర్ షాట్‌కి ప్రయత్నించి క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నో బాల్‌గా తేలడంతో బట్లర్ నాటౌట్‌గా తేలాడు...

ఆ తర్వాత మూడో ఓవ్‌లోనూ మరో నో బాల్ వేశాడు భువనేశ్వర్ కుమార్. ఉమ్రాన్ మాలిక్ వేసిన నాలుగో ఓవర్‌లో ఓ నో బాల్ రాగా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా నో బాల్ సమర్పించాడు. ఐదో ఓవర్లలోనే ఐదు నో బాల్స్ వేశారు సన్‌రైజర్స్ బౌలర్లు...

ఆరు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, రొమారియో స్టిఫర్ట్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో కీపర్ పూరన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన సన్‌రైజర్స్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 55 పరుగులు చేసిన సంజూ శాంసన్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

సిమ్రాన్ హెట్మయర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి నటరాజన్ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు.