IPL2022 RR vs GT Qualifier 1: సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్... 89 పరుగులు చేసి రనౌట్ అయిన జోస్ బట్లర్... రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు...
ఐపీఎల్ 2022 సీజన్ మొదటి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ చక్కగా రాణించారు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ జోస్ బట్లర్‌కి తోడు కెప్టెన్ సంజూ శాంసన్, యంగ్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ తమ వంతు బ్యాటు ఝులిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి శుభారంభం దక్కలేదు. 8 బంతుల్లో 3 పరుగులు చేసిన యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, యష్ దయాల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా స్వేచ్ఛందంగా పెవిలియన్‌కి బయలుదేరి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు జైస్వాల్...
క్రీజులోకి వస్తూనే మొదటి బంతికే సిక్సర్ బాదిన సంజూ శాంసన్, ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసిన సంజూ, ఐపీఎల్ 2022 సీజన్‌లో 400+ పరుగులు పూర్తి చేసుకున్నాడు...
రాహుల్ త్రిపాఠి తర్వాత ఈ సీజన్‌లో 150+ స్ట్రైయిక్ రేటుతో 400+ పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌కి నాకౌట్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు. ఇంతకుముందు 2018 ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై 46 పరుగులు చేశాడు అప్పటి ఆర్ఆర్ కెప్టెన్ అజింకా రహానే. ఆ మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన సంజూ శాంసన్, కెప్టెన్‌గా రహానే రికార్డును బ్రేక్ చేశాడు...
సాయి కిషోర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన సంజూ శాంసన్, బౌండరీ లైన్ దగ్గర అల్జెరీ జోసఫ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దేవ్‌దత్ పడిక్కల్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
ఈ వికెట్‌తో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో వికెట్ తీసిన నాలుగో కెప్టెన్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా. ఇంతకుముందు షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, డానియల్ విటోరీ ఈ ఫీట్ సాధించారు.
సీజన్ ఫస్టాఫ్‌లో దూకుడుగా ఆడిన పర్పుల్ క్యాప్ హోల్డర్ జోస్ బట్లర్, క్రీజుల నిలదొక్కుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. దీంతో ఓ ఎండ్‌లో సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్ దూకుడుగా ఆడిన స్కోరు బోర్డు వేగం అందుకోలేదు...
అయితే పడిక్కల్ అవుటైన తర్వాత రషీద్ కాన్ వేసిన 16వ ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. యష్ దయాల్ వేసిన 17వ ఓవర్‌లో నాలుగు ఫోర్లతో 18 పరుగులు రాబట్టాడు... అల్జెరీ జోసఫ్ వేసిన 18వ ఓవర్‌లో 3 ఫోర్లతో 14 పరుగులు వచ్చాయి...
7 బంతుల్లో 4 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో హార్ధిక్ పాండ్యా స్లిప్ కాగా, మరోసారి రషీద్ ఖాన్ క్యాచ్‌ని డ్రాప్ చేశాడు... ఆఖరి బంతికి 2 పరుగులు తీశాడు అశ్విన్.
రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జోస్ బట్లర్... 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఆఖరి బంతికి రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆఖరి బంతికి జోస్ బట్లర్ రనౌట్ కాగా, ఆ తర్వాతి బంతి కూడా వైడ్‌గా వెళ్లడం రియాన్ పరాగ్ రనౌట్ కావడం జరిగిపోయాయి.
